టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి..టాలెంట్ ఉన్న వ్యక్తులను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. కష్టాన్ని నమ్ముకుంటేనే ఎదుగుతారని, స్వయం కృషితో తాను ‘మెగాస్టార్’ అయ్యానని చెప్తుంటారు. ఆయనకు బాగా నచ్చిన టెక్నీషియన్స్ తో మళ్లీ మళ్లీ పని చేయాలనుకుంటారు. అలా ఆయన కెమెరామెన్ లోక్ సింగ్ ను బాగా లైక్ చేశారు. చిరంజీవి ఫేవరెట్ కెమెరామెన్ లోక్ సింగ్..చిరంజీవితో పాటు పెద్ద దర్శకుల వద్ద పని చేశారు. దర్శక రత్న దాసరి నారాయణరావుతో పాటు ఇండస్ట్రీలో ని స్టార్ డైరెక్టర్స్ తో పని చేశారు.
చిరంజీవి సినిమాలు ‘పసివాడి ప్రాణం’, ‘యమ కింకరుడు’, ‘అభిలాష’, ‘మంత్రిగారి వియ్యంకుడు’ చిత్రాలకు కెమెరామెన్ గా లోక్ సింగ్ పని చేశారు. వర్క్ పట్ల డెడికేషన్ ఉన్న వ్యక్తి లోక్ సింగ్. తనకు నచ్చినట్లు షాట్ వచ్చే దాకా చాలా కష్టపడుతాడు. పట్టు పట్టి మరీ తను, డైరెక్టర్ అనుకున్న విధంగా షాట్స్ తీస్తాడు. కానీ, ఆయనకున్న ఆ డెడికేషనే చివరకు ఆయన ప్రాణాలు తీసింది.
‘హీరో’ అనే సినిమా షూటింగ్ లో చిరంజీవి హీరో కాగా, ఇందులో ఓ సీన్ కోసం లోక్ సింగ్ చేసిన పని అప్పట్లో చర్చనీయాంశమయింది. విలన్స్ లారీతో దాడి చేయాల్సిన సీన్ లో ఆ లారీ డ్రైవర్ తనకు షాట్ కావాల్సిన విధంగా లారీని డ్రైవ్ చేయడం లేదు. దాంతో లోక్ సింగ్ చిరాకు పడి తన కెమెరా అసిస్టెంట్ కు ఇచ్చి తానే వెళ్లి..లారీ డ్రైవ్ చేశాడు. అలా తనకు నచ్చినట్లు సీన్ వచ్చేలా ప్లాన్ చేశాడు.
ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు తనయుడు భరత్ హీరోగా ‘వార్నింగ్’ అనే సినిమా చేశారు. ఈ పిక్చర్ షూటింగ్ టైమ్ లో ఓ పాట కోసం హీరోయిన్ ఆమని మంటల మధ్య డ్యాన్స్ చేస్తోంది. ఆ టైమ్ లో తను అనుకుంటున్నట్లు మంటలు రావడం లేదు. దాంతో లోక్ సింగ్ మంటల వద్దకు వెళ్లి మంటల మీద పెట్రోల్ పోశాడు. అనుకోకుండా ఆ పెట్రోల్ తాను వేసుకున్న ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ పైన కూడా పడింది. అలా అందరూ చూస్తుండగానే కెమెరామెన్ లోక్ సింగ్ మంటల్లో చిక్కుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన తెలుసుకుని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలా చిరంజీవి ఫేవరెట్ కెమెరా మెన్ చనిపోయాడు.