ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు తీసుకున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఏదో తెలుసా..?

-

కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో కోవిడ్‌ టీకాల పంపిణీ చురుగ్గా కొనసాగుతోంది. అనేక చోట్ల భిన్న రకాల కంపెనీలకు చెందిన కోవిడ్‌ టీకాలను ప్రజలకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లోనూ కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ టీకాలను వేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో స్పుత్‌నిక్‌, బయోలాజికల్‌-ఇ టీకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కంపెనీలకు చెందిన టీకాలు అందుబాటులో ఉన్నా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అత్యధిక మంది తీసుకున్న టీకా ఏది ? అంటే..

బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థ కలసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాలను మన దేశంలో కోవిషీల్డ్‌ పేరిట అందిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని పూణెకు చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. అయితే ఇదే టీకా ఇతర దేశాల్లో వేరే పేరుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఇదే టీకాను తీసుకున్నారు.

ఇక ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా టీకా తరువాత ఫైజర్‌, బయో ఎన్‌ టెక్‌లు అభివృద్ధి చేసిన టీకాను ఎక్కువ మంది తీసుకున్నారు. ఆ తరువాతి స్థానంలో చైనాకు చెందిన సైనోఫామ్‌ టీకా నిలవగా, మోడెర్నా టీకా, స్పుత్‌నిక్‌, సైనోవాక్‌, జాన్సన్‌ అండ్ జాన్సన్‌, భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ టీకాలు ఆ తరువాత వరుస స్థానాల్లో నిలిచాయి.

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాను 177 దేశాల్లో ఇస్తున్నారు. అలాగే ఫైజర్‌-బయో ఎన్‌టెక్ టీకాను 103 దేశాల్లో, సైనోఫామ్‌ను 55 దేశాల్లో, మోడెర్నా టీకాను 54 దేశాల్లో, స్పుత్‌నిక్‌ను 45 దేశాల్లో, సైనోవాక్‌ను 30 దేశాల్లో, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాను 24 దేశాల్లో, భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ను 6 దేశాల్లో ప్రజలకు ఇస్తున్నారు.

అయితే ప్రపంచ వ్యాప్తంగా రోజూ టీకాలను వేగంగా అందిస్తున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. అక్కడ ఇప్పటికే 778 మిలియన్ల మందికి టీకాలను వేశారు. రోజూ 20 మిలియన్ల సైనోవాక్‌, సైనోఫామ్‌ టీకాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 3 నెలల్లో చైనా పూర్తి స్థాయిలో టీకాల పంపిణీని చేపడుతుందని తెలుస్తోంది. మరో మూడు నెలలు దాటితే కోవిడ్‌ టీకాల పంపిణీని పూర్తి చేసిన అతి పెద్ద దేశంగా చైనా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version