దీపావళి రోజున లక్ష్మీపూజ ఎందుకు చేస్తారో తెలుసా!!

-

దీపావళి.. లక్ష్మీప్రదమైన పండుగగా పేరుదీనికి. ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు పెద్ద ఎత్తున దీన్ని జరుపుకొంటారు. ఈ పండుగ మతభేదాలు లేకుండా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ పూజ చేసి రాక్షసుల బాధలు తొలగిన ఆనందాన్ని వ్యక్తపరచుటకై దీపాలంకరాలు చేసి టపాసులు కాలుస్తారు. అసలు దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి? పూజిస్తే కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం..

 

పూర్వం దుర్వాస మహర్షి దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి అతనికి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు ఇంద్రుడు దానిని తనవద్దనున్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేశాడు. మరి ఆ ఏనుగేమో ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. ఈ ఘటనను చూసిన దుర్వాసుడు కోపంతో దేవేంద్రుని శపిస్తాడు. దేవేంద్రుడు దాని ఫలితంగా రాజ్యాధిపత్యం కోల్పోయి దిక్కుతోచక శ్రీవారిని ఆరాధిస్తాడు.

దేవేంద్రుని బాధను గమనించిన విష్ణువు అతనికి ఓ జ్యోతిని వెలిగించి లక్ష్మీదేవి స్వరూపంగా తలచుకుని ఈ జ్యోతిని పూజించమంటారు. ఆ జ్యోతి తృషి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొంది దుర్వాసుని పాదాలపై పడతాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి రాజ్యము, సంపదలను పొందిన దేవేంద్రుడు శ్రీ మహాలక్ష్మితో తల్లీ నీవు శ్రీహరి వద్దనే ఉండుట న్యాయమా.. నీ భక్తులను కరుణించవా అంటూ అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి… నన్ను త్రికరణ శుద్దిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీగా, విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా.. వారి సమస్త కోరికలను నెరవేర్చే వరలక్ష్మిగా ప్రసన్నురాలౌతానని చెప్పారు. అందుచేతనే దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సమస్త సంపదలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఇక ఆలస్యమెందుకు ఈ దీపావళి నుంచి మరింత భక్తి, శ్రద్ధలతో దీపావళి లక్ష్మీ పూజలను ఘనంగా జరుపుకోండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version