ఈ సారైనా ఉరి తీస్తారా..? 

-

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ట్రయల్‌ కోర్టు విధించిన ఉరిశిక్షల అమలులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. డెత్‌ వారెంట్లు జారీ అయినప్పుడల్లా చట్టపరమైన అవకాశాల వినియోగం పేరుతో దోషులు కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేస్తూ శిక్షల అమలు నుంచి తప్పించుకుంటూ వచ్చారు. జైలు నిబంధనల్లోని సాంకేతిక లోపాలను అడ్డం పెట్టుకుని ఏకంగా న్యాయవ్యవస్థనే అవహేళన చేశారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు.. ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు దోషులు నలుగురిని ఏకకాలంలో ఉరితీయాలని మరోసారి డెత్‌ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే మూడు డెత్‌ వారెంట్ల నుంచి తెలివిగా తప్పించుకున్న నిర్భయ దోషులు ఈ సారైనా ఉరికంబం ఎక్కుతారా? లేదంటే మరేదైనా కొత్త ఎత్తు వేస్తారా? అనే సందేహాలు మొదటి నుంచి ఈ కేసును ఆసక్తిగా గమనిస్తున్న ప్రతి ఒక్కరిలో నెలకొన్నాయి.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఏడున్నరేండ్ల నాటి ఈ రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసులో దోషులకు ట్రయల్‌ కోర్టు ఏడాదిలోపే ఉరిశిక్ష విధించింది. అయితే మొదటి డెత్‌ వారెంట్‌ మాత్రం ఈ ఏడాది జనవరి 7న జారీ అయ్యింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు దోషులను ఉరితీయాలని ఆ డెత్‌ వారెంట్‌లో కోర్టు ఆదేశించింది. ఇక ఆ రోజు మొదలు ఇప్పటివరకు దోషులు ఏదో ఒక పిటిషన్‌ వేస్తూ శిక్షలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారు.

2019, ఫిబ్రవరి 1న దోషులను ఉరితీయాలంటూ జనవరి 17న జారీ అయిన రెండో డెత్‌ వారెంట్‌, మార్చి 3న దోషులకు ఉరిశిక్షలు అమలు చేయాలంటూ ఫిబ్రవరి 17న మూడో డెత్‌ వారెంట్‌ జారీ అయినప్పుడు కూడా నిందితులు కుయుక్తులతో శిక్షల అమలు నుంచి తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో పటియాలా కోర్టు నాలుగోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది.

అయితే, దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ గత రెండు నెలలుగా తన క్లయింట్లతో వేయించిన ఎత్తులు న్యాయవ్యవస్థనే పరిహాసాలపాలు చేశాయి. ‘ఒక కేసులో దోషులుగా ఉన్నవారిని ఒకేసారి ఉరితీయలి, ఆ కేసులో దోషులు ఎంతమంది ఉన్నా అందరూ తమ చట్టపరమైన హక్కులను వినియోగించుకున్న తర్వాతనే వారికి ఉరిశిక్షలు అమలు చేయాలి’ అనే నిబంధనను అడ్డంపెట్టుకుని దోషులు కోర్టులతో చెలగాటమాడారు.

ఈ నేపథ్యంలో దోషులు ఇంకా ఎలాంటి ఎత్తులు వేస్తారోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే న్యాయ నిపుణులు మాత్రం దోషులకు ఇంకా ఎలాంటి చట్టపరమైన అవకాశాలు మిగిలి లేవని, మార్చి 20న వారిని ఉరి తీయడం ఖాయమని చెబుతున్నారు. ఉరిశిక్షపడిన ఖైదీలు చట్టపరమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఒక గడువు అనేది విధించి ఉంటే ఈ మాత్రం తాత్సారం కూడా జరిగేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు.

కాగా, నిర్భయ దోషులను ఉరికంబం ఎక్కించడానికి భాదితురాలి తల్లిదండ్రులు ఏడున్నరేండ్లుగా అలుపులేని పోరాటం చేశారు. ఇన్నాళ్లకు వారి పోరాటం ఫలించి మార్చి 20న ఉరి ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘అవకాశం ఇస్తే దోషుల ఉరిని కళ్లారా చూడాలని ఉంది’ అంటూ నిర్భయ తల్లి ఆశాదేవి కంటతడి పెట్టారు. ఏండ్లు గడిచినా దోషుల చావు కోసం ఆమె అంత కసిగా ఎదురుచూస్తున్నదంటే.. ఎంతటి కడుపుకోతను అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version