కుక్కలు ఎంతో కాలం నుంచి మనుషులకు చక్కని స్నేహితులుగా ఉన్నాయి. ఇంటికి కాపలా ఉండడమే కాదు, మనుషులకు అవి రక్షణ ఇస్తాయి. యజమానులను జాగ్రత్తగా చూసుకుంటాయి. అలాగే పోలీసులు వాటిని బాంబులను పసిగట్టేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే కుక్కలు కరోనా ఇన్‌ఫెక్షన్ వచ్చిన వారిని కూడా సులభంగా గుర్తిస్తాయని సైంటిస్టులు తాజాగా చేపట్టిన పరిశోధనల్లో తేల్చారు.
జర్మనీలోని యూనివర్సిటీ వెటర్నరీ మెడిసిన్ హానోవర్ పరిశోధకులు కోవిడ్ సోకిన, సోకని 1012 మంది పేషెంట్లకు చెందిన ఉమ్మిని సేకరించి ఒక వారం పాటు కుక్కులకు ఆ ఉమ్మి వాసన చూపించారు. దీంతో ఆ కుక్కలు బాగా శిక్షణ పొందాయి. తరువాత అవి కరోనా వచ్చిన రోగులను సులభంగా గుర్తు పట్టడం ప్రారంభించాయి. అది కూడా 94 శాతం వరకు కచ్చితత్వంతో అవి కరోనా పేషెంట్లను గుర్తిస్తుండడం విశేషం.
సాధారణంగా ఆరోగ్యవంతమైన, కరోనా సోకిన రోగుల్లో జరిగే జీవప్రక్రియల వల్ల వారి ఉమ్మికూడా మారుతుంది. అందువల్లే కుక్కలు వారిని సులభంగా గుర్తు పట్టగలవని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే కుక్కలు ఇలా కరోనా రోగులను వాసన చూసి పసిగట్టేందుకు గాను వాటికి వారం రోజుల పాటు ట్రెయినింగ్ ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. దీని వల్ల పబ్లిక్ ప్లేసుల్లో కరోనా సోకిన వారిని టెస్టులు చేయకుండానే సులభంగా గుర్తించవచ్చని, ఇన్‌ఫెక్షన్ వ్యాపించకుండా చూడవచ్చని అంటున్నారు. కాగా సైంటిస్టులు చేపట్టిన ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలను బీఎంసీ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్‌లో ప్రచురించారు. ప్రస్తుతం జర్మనీలో మరిన్ని శునకాలకు కోవిడ్ 19 వ్యక్తులను పసిగట్టేందుకు శిక్షణ ఇస్తున్నారు.