ప్రస్తుతం దాదాపుగా ఎవరిని చూసినా డిజిటల్ పేమెంట్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నగదుతో లావాదేవీలను చాలా తక్కువగా చేస్తున్నారు. కారణం.. బయట ప్రతి చోటా ఆన్‌లైన్ లో డబ్బును పంపుకునే వెసులుబాటు ఉండడమే. అందువల్లే ప్రజలు ఎక్కువగా డిజిటల్ పేమెంట్ల బాట పట్టారు. అయితే డిజిటల్ పేమెంట్ అంటే సాధారణంగా యూపీఐ ద్వారానే అవుతాయి. యాప్‌లు వేరే అయినా ప్లాట్‌ఫాం మాత్రం ఒక్కటే. అందువల్ల అందరూ యూపీఐనే పేమెంట్ల కోసం ఉపయోగిస్తున్నారు. ఇక యూపీఐ ద్వారా నగదు పంపేందుకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి ? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యూపీఐ అనేది ఐఎంపీఎస్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. కనుక దాని ద్వారా రోజుకు గరిష్టంగా రూ.1 లక్ష వరకు నగదును పంపుకునేందుకు వీలుంది. ఈ పరిమితిని ఎన్‌పీసీఐ విధించింది. ఇక ఒక యూపీఐ అకౌంట్ నుంచి రోజుకు 20 సార్లు చెల్లింపులు చేయవచ్చు. పరిమితి దాటితే మళ్లీ 24 గంటలు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే బ్యాంకులను బట్టి నిత్యం జరిపే యూపీఐ చెల్లింపుల లిమిట్స్ మారుతాయి. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆంధ్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, దేనా బ్యాంక్ ఖాతాదారులు రోజుకు గరిష్టంగా రూ.1 లక్ష వరకు యూపీఐ ద్వారా పంపవచ్చు. ఒక్క ట్రాన్సాక్షన్‌కు రూ.1 లక్షను పరిమితిగా విధించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఒక్క ట్రాన్సాక్షన్‌కు రూ.25వేల చొప్పున రోజుకు రూ.50వేలను యూపీఐ ద్వారా పంపుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కస్టమర్లు రోజుకు రూ.20వేలను రెండు విడతల్లో విడతకు రూ.10వేల చొప్పున పంపవచ్చు.
కార్పొరేషన్ బ్యాంకు కస్టమర్లు ఒక్క ట్రాన్సాక్షన్‌కు రూ.50వేల చొప్పున రోజుకు రూ. 1 లక్ష పంపుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక్క ట్రాన్సాక్షన్ కు రూ.10వేలు పంపవచ్చు. రోజుకు గరిష్ట పరిమితి రూ.1 లక్షగా ఉంది. సెంట్రల్ బ్యాంకులో అయితే రోజుకు రూ.50వేలు, ఒక్క ట్రాన్సాక్షన్‌కు రూ.25వేలను గరిష్టంగా యూపీఐ ద్వారా పంపించవచ్చు. ఇక భీమ్ యాప్ ద్వారా అయితే ఒక ట్రాన్సాక్షన్‌కు రూ.40వేల వరకు అనుమతి ఉంటుంది. రోజుకు రూ.40వేలను గరిష్టంగా పంపించుకోవచ్చు.
యూపీఐ ద్వారా మర్చంట్లు రోజుకు రూ.2 లక్షల వరకు పేమెంట్లను యాక్సెప్ట్ చేయవచ్చు. ఇక ఫోన్ ను మార్చినా, మొబైల్ నంబర్, యూపీఐ పిన్ లను మార్చినా మొదటి 24 గంటల వరకు కేవలం రూ.5వేలను పంపించుకునేందుకు మాత్రమే అనుమతిస్తారు.