ఆసుపత్రికి వెళ్తున్నారా.. ఇవి గుర్తుంచుకోండి..!

-

ఏదైనా అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్తున్నారా.. లేక మీ ఆప్తులు ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నారా.. వారిని పరామర్శించేందుకు మీరు వెళ్తున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి. రోగాలు నయం చేయాల్సిన ఆసుపత్రులే రోగాలకు నిలయంగా మారుతున్నాయట. ఆపరేషన్ల తర్వాత ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో రకమైన ఇన్‌ఫెక్షన్ల బారినపడుతున్నారట.

ఇదేదో ప్రభుత్వాసుపత్రుల సంగతి కాదండోయ్.. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించుకున్న కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ ఇదే జాడ్యం ఉందట. కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ కొన్ని రకాల సూక్ష్మక్రిములు సుమారు 5 నెలల వరకూ జీవిస్తున్నాయట. అరకొర పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో కొన్ని రకాల మొండి క్రిములు ఏకంగా 30 నెలల వరకూ కూడా జీవిస్తున్నాయట.

 

ఇదేదో ఆషామాషీ లెక్క కాదు.. అమెరికాకు చెందిన ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ)’ ఈ వివరాలు వెల్లడించింది. అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లోని ఆసుపత్రుల్లోనూ ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తి కొనసాగుతోందట. అక్కడే అలా ఉంటే.. ఇక మన భారత్‌ సంగతి వేరే చెప్పాలా.. ఇక్కడ అధిక శాతం ఆసుపత్రులు అంటువ్యాధులకు నిలయాలుగా మారాయని ఈ నివేదిక చెబుతోంది.

అందుకే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తున్నాం కదా..అని అజాగ్రత్తగా ఉండకూడదన్నమాట. మన జాగ్రతలో మనం ఉండాలి. ఆసుపత్రుల్లో ఉన్నా.. ఇన్పెక్షన్ల సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన సమయాల్లో చేతి తొడుగులు ధరించాలి. గదుల్లో తరచూ యాంటీసెప్టిక్‌, డిటర్జెంట్‌ రసాయనాలను వినియోగిస్తున్నారో లేదో వాకబు చేయాలి. తప్పదు మరి మన ఆరోగ్యం కోసం ఆ మాత్రం జాగ్రత్త అవసరమే.

Read more RELATED
Recommended to you

Latest news