గ్రహణం రోజు ఏం చేయాలి
సాధారణంగా గ్రహణం ఏర్పడే సమయంలో కర్మసిద్ధాంతం నమ్మేవారు ముఖ్యంగా హిందువులు కొన్ని నియమాలను పాటించాలి.
దేవాలయాల మూసివేత..
గ్రహణాల సమయాల్లో అన్ని ఆలయాలను మూసివేస్తారు. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం మాత్రం దీనికి మినహాయింపు. ఇక్కడ స్వామి నవగ్రహ కవచం ధరించి ఉంటారు. వాయురూపంలో ఉండటం వల్ల ఇక్కడ దేవాలయం మాత్రం తెరచి ఉంచుతారు.
గ్రహణం ప్రారంభానికి ముందే భోజనాదులు లేదా అల్ఫాహారం తీసుకోవాలి. కనీసం రెండు గంటలు పెద్దలు, పిల్లలు, గర్భిణులు అయితే కనీసం గంటముందే ఆహారం తీసుకుంటే మంచిది. ఇక గ్రహణ ప్రారంభానికి ముందే స్నానం చేసి శుభ్రమైన వస్త్రంతో వారి వారి ఆచారాలను బట్టి ఉపదేశ మంత్రాలను లేదా గాయత్రీ మంత్రం లేదా పంచాక్షరి, అష్టాక్షరి ఇలా వారివారి ఇష్టదేవత నామ జపం చేయడం శ్రేయస్కరం. గ్రహణ అనంతరం పట్టువిడుపు స్నానం చేసి ఇండ్లు తుడుచుకుని దేవుడి పూజ, వంట, నైవేద్యాలు సమర్పించి భోజనం చేయడం మంచిది.
గ్రహణ దోష నివారణకు ఏం చేయాలి ?
గ్రహణం మిధున రాశి వారు మృగశిర, ఆరుద్ర నక్షత్ర జాతకులు కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది. కర్మ సిద్ధాంతం నమ్మేవారు కింద చెప్పిన విధంగా దానాలు చేస్తే దోష తీవ్రత తగ్గుతుంది. గ్రహణం రోజు లేదా తెల్లవారి రోజున దేవాలయం లేదా దగ్గరిలోని పండితులకు బియ్యం, గోధుమలు, మినుగులు, అవకాశముంటే వెండి సర్ప ప్రతిమలు 2 మాత్రం దానం చేయడం మంచిది. పేదలకు పండ్లు, బియ్యం,గోధుమలు ఇవ్వడం కూడా మంచిదే. గోవులకు బెల్లం, గోధుమలను తినిపించడం అతి తక్కువ ఖర్చుతో అత్యంత ప్రభావంతమైన పరిహారంగా పండితులు పేర్కొంటున్నారు. అమావాస్య కావున బ్రహ్మణేతరులు పెద్దల పేరున స్వయం పాకం ఇవ్వచ్చు. ఎవరి శక్తి అనుసారం వారు దానం చేయాలి.