రాజకీయాల్లో ఉన్నవాళ్లు.. నిన్న పొగిడిన నోటితోనే నేడు పొగిడారంటే.. పోనీలే.. వాళ్లు నాయకులు అలానే మాట్లాడతారని సరిపెట్టుకోవచ్చు. కానీ, నిజాలను నిర్భయంగా చెపుతామని చెప్పుకొనే కొన్ని మీడియా చానెళ్లు ఫక్తు రాజకీయ నేతలను మించిపోయిన విధంగా వ్యవహరించడంపై ఏపీలో చర్చ సాగుతోంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో వైద్యులకు మాస్కులు ఇవ్వలేదని,పీపీఈలు ఇవ్వలేదని, కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఇలా శోకణ్నాలు పెట్టి.. మొట్టికాయలు వేయించుకున్న ఓ తెలుగు మీడియా ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది.
ఏపీలో కరోనాపై ప్రభుత్వం అస్సలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, సీఎం జగన్ సహా మంత్రులు నిద్దరోతున్నారని, ఇక, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించిన కారణంగానే రాష్ట్రంలో కరోనా కోరలు చాచిందని, అస్సలు ప్రభుత్వానికి చిత్త శుద్ధిలేదని సదరు మీడియా రోడ్డెక్కింది. వాస్తవానికి కేంద్రం చెప్పిన లెక్కలు తీసుకుంటే..(నిన్నటికి నిన్న ఇదే మీడియాకు చెందిన పేపర్‌లో రాశారు.) దేశంలో కరోనా టెస్టులు చేయడంలో ఏపీ రెండో స్థానంలో నిలిచిందని, మాస్కులు ప్రతి ఒక్కరికీ ఉచితంగా పంపిణీ చేయడం చాలా సంచలన నిర్ణయమని పేర్కొంది.
అదే సమయంలో కరోనా ను ఆరోగ్య శ్రీ కింద చేర్చారు. ఇక, పేదలకు ఇప్పటికే నెలకు రెండు సార్లు రేషన్ ఇచ్చారు. దాదాపు కరోనా టెస్టింగ్ రేటును పెంచారు. మరి ఇన్ని చేస్తున్నా.. సదరు మీడియా నిన్న మొన్నటి వరకు సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడు ఒక్కసారిగా విరుచుకుపడడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? అ నేది చర్చకు వచ్చింది.
విశ్లేషకులు చెబుతున్న మేరకు.. తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడిన వైరాన్ని సంధించేసుకునే భాగంలోనే ఏపీలో ఉన్న ప్రభుత్వంపై బెడ్డలు వేస్తున్నారని చెబుతున్నారు. వాస్తవానికి తెలంగాణలో పరిస్థితి కూడా చేతులు దాటుతోందని అక్కడి సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ, ఈ విషయాన్ని వాస్తవాన్ని సదరు మీడియా ఇప్పుడు తొక్కి పెట్టి.. కేవలం ఏపీపై ఉద్దేశ పూర్వకంగానే వ్యాఖ్యలు చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.