కరోనా బారిన పడి హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న వారికి త్వరగా కోలుకునేందుకు డీఆర్‌డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) తయారు చేసిన 2డిజి మెడిసిన్ అద్భుతంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించింది. దీంతో ఈ ఔషధాన్ని రెడ్డీ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. అయితే 2డిజి ఔషధాన్ని వాడేందుకు గాను మంగళవారం డీఆర్‌డీవో పలు సూచనలు జారీ చేసింది.
2డిజి ఔషధాన్ని కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న వారు ఉపయోగించాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ మందును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వారికే ఈ ఔషధాన్ని విక్రయిస్తారు. హాస్పిటళ్లలో చికిత్స పొందే కోవిడ్ బాధితులకు మాత్రమే ఈ మందును అందిస్తారు. సాధారణ చికిత్సతోపాటు ఈ మందును ఇవ్వాల్సి ఉంటుంది.
కోవిడ్ మధ్యస్థ లక్షణాలు ఉన్న రోగులు 10 రోజుల వరకు ఈ మెడిసిన్‌ను ఉపయోగించవచ్చు. దీంతో పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉంటుంది. రోగులను ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చు. డయాబెటిస్, కార్డియాక్ సమస్యలు, ఏఆర్‌డీఎస్, హెపాటిక్, రెనాల్ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు ఈ మందును వాడుకోవాలి.
18 ఏళ్ల లోపు వయస్సు వారికి, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఈ మెడిసిన్‌ను ఇవ్వరాదు. కోవిడ్ బాధితులు ఈ మందు కోసం తాము చికిత్స పొందే హాస్పిటల్‌ను గానీ, రెడ్డి ల్యాబ్స్ హైదరాబాద్ శాఖను గానీ సంప్రదించాలి. మెడిసిన్ కోసం బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు, బంధువులు 2DG@drreddys.com అనే మెయిల్‌కు రిక్వెస్ట్ పెట్టాలి. దీంతో బాధితులు చికిత్స పొందుతున్న హాస్పిటల్‌కు ఈ మెడిసిన్‌ను పంపుతారు. ఈ మందుకు చెందిన ఒక సాచెట్ ధర రూ.990గా ఉంది. దీన్ని తీసుకున్న కోవిడ్ బాధితులు త్వరగా కోలుకుంటున్నారని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. దీన్ని తీసుకున్న మొదటి రోజు నుంచే ఆక్సిజన్‌పై ఆధారపడడం తగ్గుతుందని తేలింది.