భారతదేశ వంటగదుల్లో ధన్యాలు లేకుండా ఊహించలేం. ఆహారానికి అదనపు రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ధన్యాలని ప్రతీ ఒక్కరూ తమ వంటగదుల్లో ఉంచుకుంటారు. ఇందులో విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. ధన్యాలని చాలా రకాలుగా తీసుకోవచ్చు. సుగంధ ద్రవ్యాల మాదిరిగా, హెర్బల్ టీ, ఇంకా ధన్యాలు కలిపిన నీళ్ళ ద్వారా. ఇటీవల ఆయుష్ మినిస్ట్రీ ప్రకటించిన కరోనా నియంత్రణ విధానాల్లో ధన్యాలని ఆహారంగా తీసుకోవాలని ఉన్న సంగతి మరోసారి గుర్తు చేసుకుందాం.
ప్రస్తుతం ధన్యాలతో కలిపిన నీటిని ఎలా తయారు చేసుకోవాలి? దానివల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.
లాభాలు
ఆర్థరైటిస్ నొప్పులనుండి విముక్తి కలిగిస్తుంది. ఎముకలకి బలాన్ని చేకూర్చి ఆరోగ్యంగా ఉంచుతుంది.
శరీరంలో నీటిశాతాన్ని తగ్గకుండా చూసుకుంటుంది. వేసవిలో ఇబ్బంది పెట్టే డీహైడ్రేషన్ నుండి కాపాడుకోవడానికి రోజుకి రెండు గ్లాసుల ధన్యాల నీళ్ళు తాగితే చాలా మంచిది. శరీరంలో నీటిని సులభంగా పోనియ్యకుండా చూసుకుంటుంది. దానివల్ల బలహీనత ఉండదు.
కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. మూత్రపిండాలను పాడుచేసే మలినాలని బయటకి పంపించివేయడంలో ధన్యాలు కలిపిన నీళ్ళు బాగా ఉపయోగపడతాయి.
ముందుగానే చెప్పుకున్నట్టు వేసవిలో పుట్టే వేడిమిని తగ్గించి చల్లగా ఉంచుతుంది. తద్వారా వేడివల్ల కలిగే ఇబ్బందులు దూరం అవుతాయి.
ముఖం ఉబ్బుగా ఉన్నట్లయితే దాన్ని తగ్గిస్తుంది. దానివల్ల మీరు మరింత యవ్వనంగా కనిపిస్తారు.
మరి ఈ ధన్యాల కలిపిన నీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
ఒక టేబుల్ స్పూన్ ధన్యాలని తీసుకుని వాటిని కొన్ని మంచినీళ్ళలో వేసి పొయ్యి మీద పెట్టాలి. చిన్న మంట పెట్టి అలాగే ఉంచాలి. మనం పోసిన మంచినీళ్ళు సగం అయ్యేదాకా మరిగించాలి. ఆ తర్వాత వడపోసి గ్లాసులోకి పోసుకోవాలి. దీన్ని ఉదయం సాయంత్రం రెండుపూటలా తాగవచ్చు. కాకపోతే కిడ్నీ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ఈ ధన్యాలు కలిపిన నీళ్ళని తాగాలనుకుంటే ఒక్కసారి వైద్యుడిని సంప్రదిస్తే బాగుంటుంది.