సరిహద్దుల్లో కలకలం.. ఐఈడీ జారవిడిచేందుకు యత్నం

-

దేశ సరిహద్దుల్లో డ్రోన్ల కలకం కొనసాగుతున్నది. శుక్రవారం ఉదయం ఎల్‌ఓసీకి సమీపంలోని గురు పట్టాన్ ప్రాంతంలో డ్రోన్‌ను అఖ్నుర్ పోలీసులు కూల్చివేశారు. అనంతరం దానిని పరిశీలించగా ఐఈడీ IEDలో వినియోగించే 5కిలోల పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. జమ్ములోని ఎయిర్ ఫోర్స్ బేస్ స్టషన్ సమీపంలో డ్రోన్ ద్వారా పేలుడు పదార్థాలను జాడ విరిచిన వారం తర్వాత తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్ రావడం గమనించిన పోలీసులు కాల్పులు జరిపి నేలకూల్చారు. ఒక ప్లాస్టిక్ కవర్‌లో ఐఈడీలో వినియోగించే పదార్థాలను డ్రోన్‌లో ఉంచి దానిని దేశ సరిహద్దుల్లో జార విడవడం ఉగ్రవాదుల లక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ పేలుడు పదార్థాలను సేకరించిన వారు ఫ్యూజ్‌ను వైర్లతో కలిపి పేలుళ్లకు పాల్పడవచ్చు.

స్వాధీనం చేసుకున్న ఐఈడీ పేల్చివేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దుశ్చర్య వెనుక ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తాయిబా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం డ్రోన్ ద్వార ఐఈడీ జారవిడిచే ప్రయత్నం జరిగిన మాట వాస్తవమేనని అదనపు డీజీ ముఖేశ్ సింగ్ తెలిపారు.

వచ్చే రెండు రోజుల్లో కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రాంతాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సందర్శించాల్సి ఉంది. దేశ ప్రథమ పౌరుడి పర్యటనకు ముందు డ్రోన్ ద్వారా ఐఈడీ జారవిడిచే ప్రయత్నం పలు అనుమానాలకు తావిస్తున్నది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version