ఇటీవల ఉగ్రవాదులతో దొరికిన డిఎస్పీ దవీందర్ విషయంలో భారత దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. అతనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతూ సంచలన విషయాలను బయటపెడుతున్నాయి. ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులకు 12 లక్షలు తీసుకుని సాయ౦ చేసిన ధవీందర్ అధికారులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఆయన ఇంట్లో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మ్యాప్ సహా పలు కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా దాడికి రెండు నెలల ముందే ఆయన బదిలీ అయ్యారు. డబ్బు కోసం కీలక సమాచారాన్ని ఉగ్రవాదులకు ఆధారాలతో సహా ఇచ్చాడని అధికారులు గుర్తించారు. ఏడు లక్షల రూపాయలు తీసుకుని ఒక కీలక సమాచారం ఇచ్చారని అధికారుల విచారణలో తేలింది. ఉగ్రవాదులను శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నాడని కూడా అధికారులు గుర్తించారు.
అతనికి గతంలో ఇచ్చిన అవార్డులను కూడా ఉపసంహరించుకున్నారు. అలాగే లక్షల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 11 న ఉగ్రవాదులను తన ఇంట్లో ఉంచుకున్నాడని గుర్తించారు. వారిని శ్రీనగర్ విమానాశ్రయం ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అతని బంధువుల ఇళ్ళల్లోను అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాదులు ఇచ్చిన సొమ్ముతో భారీగా ఆస్తులు కూడబెట్టాడని అధికారుల విచారణలో వెల్లడైంది.