మార్పు మంచిదేగా ? టీఆర్ఎస్ కు ఇబ్బందేగా ?

-

మొత్తానికి బిజేపీ ఖాతాలో దుబ్బాక నియోజకవర్గం వచ్చి చేరింది. ఇది రాబోయే మార్పుకు సంకేతంగా ఆ పార్టీ నాయకులు అప్పుడే ప్రచారం మొదలు పెట్టేశారు. ఇక్కడ బిజెపి అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన రఘునందన్ రావు మొదటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేసుకుంటూ వచ్చారు. 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో రఘునందన్ ఓటమి చెందినా, ఎక్కడా నిరాశ చెందకుండా, నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడం, నిత్యం ప్రజాసమస్యలు చేస్తూ, పోరాటాల పై దృష్టి పెట్టి , ప్రజల్లో మమేకం అవ్వడం , బీజేపీ విధానాలను గట్టిగా ప్రచారం చేస్తూ,  టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ,  నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ హైలెట్ చేస్తూ ప్రభుత్వంపై రాజీలేకుండా పోరాటం చేయడం,  ఎలా ఎన్నో ఎన్నో అంశాలు బిజెపి గెలుపుకు బాటలు వేశాయి.
తెలంగాణలో టిఆర్ఎస్ కు ఎదురే ఉండదని, ఎదురు ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తూ వచ్చింది. అయితే అదే ఆ పార్టీకి శాపంగా మారింది. కాంగ్రెస్ క్రమంగా బలహీనపడడంతో, ఆ స్థానాన్ని బిజెపి ఆక్రమించింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అన్నట్లుగా నిత్యం టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తూ, ప్రజల్లో బలమైన ముద్ర వేసుకోవడం లో ఆ పార్టీ నాయకులు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ బీజేపీని బలోపేతం చేసే అంశంపైనే దృష్టి పెడుతూ, ముందుకు వెళ్ళిన తీరు తెలంగాణలో ఆ పార్టీ బలపడడానికి ప్రధాన కారణం అయింది. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది.
తర్వాత 2018 లోనే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్ పార్టీని విజయం వైపు నడిపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావ్యతిరేక విధానాలకు ఎక్కువగా పాల్పడడం, తమకు తప్ప మరే పార్టీకి తెలంగాణలో అధికారం దక్కే ఛాన్స్ లేదనే ఓవర్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ టిఆర్ఎస్ ను బాగా దెబ్బతీశాయి. ఇక చాపకింద నీరులా విస్తరించుకుంటూ వచ్చిన బిజెపి ఇక ముందు ముందు కూడా మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతోంది. త్వరలో జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు దుబ్బాక ఉప ఎన్నికల్లో లభించిన విజయమే ఆ పార్టీకి స్ఫూర్తిగా నిలవబోతోంది. ముందు ముందు మరిన్ని విజయాలను నమోదు చేసుకునేందుకు బిజెపి మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్లేందుకు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి బూస్ట్ లా పని చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version