తెలంగాణ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌కు ముందు బీజేపీ సత్తా చాటింది. చివరగా గెలుపు ఓటములు ఎలా ఉన్నా కారు పార్టీకి మామూలుగా బ్రేకులు వేయలేదనే చెప్పాలి. మూడు పార్టీల అభ్యర్థుల్లో గులాబీ పార్టీ అభ్యర్థి సుజాత క్యాండెట్ పరంగా వీక్ అయినా పార్టీ పరంగా స్ట్రాంగ్. ఇక ఆమెకు అధికార పార్టీ నుంచి కావాల్సినంత డబ్బులు రావడంతో పాటు ఈ ఉప ఎన్నిక భారం అంతా మంత్రి హరీష్‌రావు తీసుకోవడం.. అసలు అభ్యర్థి హరీష్‌రావే అన్న ప్రచారంతో అధికార పార్టీ కాస్త ముందున్న మాట వాస్తవం.
ఇక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇక్కడ మూడోసారి పోటీ చేస్తుండడంతో సానుభూతి ఉంది. ఆయనకు 25 – 30 వేల ఓటు బ్యాంకు కూడా ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకులు అందరూ కలిసి కట్టుగా ప్రచారం చేశారు. పైగా టీఆర్ఎస్ కాంగ్రెస్‌ను వదిలేసి రఘునందన్‌ను గట్టిగా టార్గెట్ చేయడంతో ఆయనకు చివరకు మరింత సానుభూతి పెరిగి.. మరింత గట్టి పోటీదారు అయ్యాడు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి ఆయన తండ్రి, మాజీ మంత్రి ముత్యంరెడ్డి నుంచి వచ్చిన క్లీన్ ఇమేజ్ ఉన్నా.. ఆర్థికంగా స్థితిమంతుడు కాకపోవడం మైనస్.
మూడు పార్టీల మధ్య పోటీ ఉన్నా బీజేపీ కాంగ్రెస్‌ను రేసులో వెనక్కు నెట్టేసింది. ఇప్పుడు ఇక్కడ పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యే నడిచింది. బీజేపీకి చివర్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారంతో పాటు రఘునందన్‌ను పోలీసులు పదే పదే టార్గెట్ చేయడం, అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ దూకుడు ఇవన్నీ బాగా ప్లస్ అయ్యాయి. ముందు నుంచి గెలుపే కాదు ఏకంగా 50 వేల మెజార్టీ వస్తుందని లెక్కలు వేసుకున్న టీఆర్ఎస్ నేతలు చివరకు 15 వేల మెజార్టీతో అయినా గెలుస్తామని లెక్కలు వేసుకునే కాడకు వచ్చారు.
టీఆర్ఎస్‌కు తిరుగులేని కంచుకోటగా ఉన్న దుబ్బాకలో కారు వేగాన్ని కమలం పార్టీ చాలా స్లో చేసేసింది. ఏదేమైనా దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉండబోతోందన్న అంశాన్ని తేటతెల్లం చేయబోతోంది. రేపు ఇక్కడ టీఆర్ఎస్ గెలిచినా 2023 ఎన్నికలకు ఆ పార్టీ ప్రత్యర్థి బీజీపీయే అన్న అంచనాలు ఇప్పటికే వెలువడుతున్నాయి.