క్రీడా అభిమానులు ఎంతగానో ఆస్వాదించే ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. అయితే ఐపీఎల్ ప్రారంభం కాగానే ఓవైపు బెట్టింగ్ మాఫియా, మరోవైపు బ్లాక్ టికెట్ మాఫియా పేట్రేగిపోతుంటాయి. అయితే తాజాగా ఈ 18వ ఐపీఎల్ సీజన్ లో ఐపీఎల్ టికెట్ల పేరుతో నిలువు దోపిడీ జరుగుతోందని ఓ క్రికెట్ అభిమాని కీలక విషయాలు వెల్లడించారు. శుక్రవారం రోజున చెపాక్ గ్రౌండులో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) మ్యాచ్‌ను వీక్షించిన అభిమాని సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
సీఎస్కే ఫ్యాన్ ఒకతను సీఎస్కే ఆర్సీబీ మధ్య జరుగుతున్న మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. అయితే ఆ మ్యాచ్ చూసేందుకు టికెట్ కొన్న అతడు … ఐపీఎల్ టికెట్లలో భారీ దోపిడీ జరుగుతోందని ఆరోపించాడు. తాను రూ. 4000లు పెట్టి టికెట్ కొంటే.. 1,657 రూపాయలను పన్నుల రూపంలో చెల్లించాల్సి వచ్చిందని వాపోయారు. చెన్నైలో బేసిక్ టికెట్ ధర రూ. 2,343 ఉండగా.. ఎంటర్టైన్మెంట్ టాక్స్ (25%) కింద 781.. 28 శాతం జీఎస్టీ (కేంద్రానికి 14%.. రాష్ట్రానికి 14%) ఇలా మొత్తం రూ. 4000 రూపాయల్లో 1657 రూపాయలను పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తోందంటూ వాపోయాడు.