దసరా.. సరదాలకే కాదు సకల కార్యజయాలకు ఇది నిలయం. దీన్ని దేశంలోని పలు ప్రాంతాలలో అనాదిగా అత్యంత వైభవంగా నిర్వహింస్తున్నారు. అలాంటి వాటిలో కొన్ని విశేషాలు తెలుసుకుందాం..
మైసూరు
దసరా అంటే మైసూర్ మొట్టమొదట గుర్తు వస్తుంది. నాటి రాజుల కాలం నుంచి నేటి వరకు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. ఈ సందర్భంగా ఈ నగరాన్ని అత్యంత వైభవంగా అలంకరిస్తారు. మైసూరు దసరా ఉత్సవాలలో ఏనుగుల ఊరేగింపు .. సూరు మహారాజు పాలన కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. మహారాజు వారి కులదైవం అయిన చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావడం అలవాటు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. ఆసమయంలో రాజభవనం ప్రత్యేకంగా అలంకరించ బడుతుంది. ఆ సమయంలో ఫ్లోటింగ్ కారు ఉత్సవాలు ప్రాధాన్యత సంతరించుకున్నవే. ఏనుగుల అలంకరణా ప్రత్యేకమే. రాజుగారి ఆయుధ పూజ వైభవంగా జరుగుతుంది.
ఇక దేశంలో శక్తి పూజ అంటే గుర్తుకువచ్చే నగరం కలకత్తా.. కలకత్తా అంటే కాళీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కలకత్తాలో దసరాను దుర్గాపూజ పర్వదినంగా బెంగాలీయులు జరుపుకొంటారు. సప్తమి, అష్టమి, నవమి తిధులలో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళికామాతను దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షలమందిని దర్శించడం విశేషం. తొమ్మిది రోజులూ రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆరోజున నదీతీరంలో కుమారీ పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత. దసరాకు బెంగాళీలు చేసే వంటలు మరీ ముఖ్యంగా తియ్యని పదార్థాలు అంటే అవేనండీ .. స్వీట్స్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి.
ఒడిషా
ఒడిషా పౌరులు దసరా సమయంలో దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధివీధిలో ప్రతిష్ఠిస్తారు. స్త్రీలు మానికలో వడ్లు నింపి లక్ష్మీ దేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు.మార్గశిర మాసంలో కూడా ఈ చిహ్నంతో వారు లక్ష్మీదేవి ఆరాధించడం అలవాటు. దీనిని వారు మాన బాన అంటారు. ఒడిషా ప్రజలు విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణసంచాతో తయారు చేసి మదానంలో కాలుస్తారు. ఈ రావణ కాశ్హ్టం చూడటానికి ప్రజల తండోప తండాలుగా వస్తారు.
గుజరాత్
దసరా సమయంలో గుజరాతీయులు పార్వతిదేవి ఆరాధన చేస్తారు. ఇంటింటా శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఆచారం.ఇంటి గోడల మీద శ్రీ చక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు.ఆ గుర్తుల సమీపంలో పొలం నుండి తీసుకు వచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ, గోధుమ విత్తనాలను చల్లి దానిపై మట్టి ఉండ పెట్టి దానిని నీటితో నింపి పోకచెక్క వెండి లేక రాగి నాణెం వేస్తారు. ఆ మట్టికుండను వారు దేవిగా భావిస్తారు. దానిని వారు కుంభీ ప్రతిష్ట అంటారు. అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు. అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిసారు. తరువాత పౌర్ణమి వరకూ జరిగే గర్భా అనే ఉత్సవాలలో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొటారు.
విజయవాడ భేతాళ నృత్యం
విజయవాడలోని ప్రధాన ఆలయాలలో బెజవాడ కనక దుర్గమ్మ ఒకటి. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రాముఖ్యం ఉన్న ఆలయం. నవరాత్రి తొమ్మిది రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి విజయదశమి నాటికి కృష్ణా నదిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడు సార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాతబస్తిలో ఉరేగిస్తారు. వన్‌టౌన్ పోలీసు స్టేషను వద్దకు రావడముతో ఉరేగింపు ముగిస్తుంది. దసరా సందర్భంలో చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తారు. ఈ భేతాళ నృత్య ప్రదర్శన విజయవాడ ప్రత్యేకత.
వీరవాసరం ఏనుగుల సంరంభం
పశ్చిమ గోదావరి జిల్లా వీర వాసరంలో దసరా సమయంలో సుమారు వంద సంవత్సరాల నుండి ఏనుగు సంబరాలు జరపపడం అలవాటు. దసరా మొదటి రోజున ఏనుగుగుడి లో భేతాళుడిని నిలబెడతారు. భేతాళుడంటే వయసైన బ్రహ్మచారి. తొమ్మిది రోజులు భేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తాడు. ఈ తొమ్మిది రోజులు భేతాళుడు నియమ నిష్టలను ఆచరిస్తాడు. మొదటి రోజునుండి నూరు సంవత్సరాల క్రితం వెదురు కర్రలు గడ్డి కొబ్బరిపీచుతో చేసిన ఏనుగును నూతనంగా అంబారీతో అలంకరిస్తారు. తెల్లని వస్ర్తానికి రంగుల లతలు, కాగితంపూలు, తగరంతో అలంకరణలు చేసి అంబారీ చేస్తారు. అలాగే నూతనంగా చిన్న ఏనుగును తయారు చేసి అలంకరించి చివరి రోజున బోయీలచే ఊరేగింపుగా తీసుకు వెళతారు.ఈ ఊరేగింపులో పిల్లలను ఏనుగు కింద నుండి దాటిస్తారు. అలాదాటిస్తే పిల్లలు రోగ విముక్తులై ఆరోగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు. రాత్రి ఆరు గంటలకు ప్రారంభించి తెల్లవారి ఆరుగంటలవరకూ సాగి తూపు చెరువు కట్టకు చేరుకొని ఈ ఉత్సవాన్ని ముగిస్తారు.
విజయనగరం సిరిమాను
విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడి తల్లికి పూజలు చేస్తారు. ఈ దేవికి దసరా వెళ్ళిన తరువాత మొదటి మంగళవారం నాడు జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా పూజారిని సిరిమాను ఎక్కించి అమ్మవారి గుడి ఉన్న మూడు లాంతర్ల సెంటర్ నుండి కోట వరకు మూడు సార్లు ఊరేగిస్తారు. ఈ ఉత్సవం చూసేందుకు చుట్టు పక్కల పల్లేలనుండి ప్రజలు ఎడ్లబండిలో మూడురోజుల ముందుగా వచ్చి రోడ్డు ప్రక్కన గుడారాలు వేసుకుని ఉత్సవం చూసి ఆనందిస్తారు. అడవిలో నుండి ఒక నిటారైన చెట్టును నరికి తీసుకు వచ్చీ మొదలు భాగాన్ని లాగుడు బండికి కట్టి చివరి భాగంలో ఊయలకట్టి అందులో పూజారిని కూర్చో పెట్టి ఊరేగింపుగా కోటకు తీసుకు వస్తారు . అక్కడ గజపతులు అమ్మవారికి లాంఛనాలు ఇచ్చి పూజిస్తారు.
వీపన గండ్లలో రాళ్ళయుద్దం
కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరాసమయంలో రాళ్ళయుద్ధం చేసుకుంటారు. దసరా రోజున సాయం వేళలో ప్రజలు కాలువ ఒడ్డున కాలువకు అటూఇటూ చేర కంకర రాళ్ళను గుట్టగా పోసుకుని ఒకవైపు రామసేన ఒకవైపు రావణ సేనగా ఊహించి రాళ్ళను విసురుతూ యుద్ధం చేసుకుంటారు. ఇది అధర్మంపై ధర్మం యుద్దంచే వుజయం చేసినట్లు భావిస్తారు. దీనిని వాళ్ళు వాళ్ళు రామ రావణ యుద్ధంగా అభివర్ణిస్తారు. ఎంత ఎక్కువగా దెబ్బలు జరిగితే అంత ఎక్కుగా ఉత్సవం జరిగినట్లు విశ్వశిస్తారు. ఇదే సమయంలో ఇదే జిల్లాలోని దేవరగట్టు గ్రామంలో కూడా బన్ని ఉత్సవం జరుగుతుంది. మాలమల్లేశ్వరస్వామి విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 18 గ్రామాల ప్రజలు, దేవరగట్టు నెలవై ఉన్న రెండుగ్రామాల పరిధిలోని ప్రజలతో కొట్లాడతారు. స్వామిని తీసుకువెళ్లేందుకు ఓ వర్గం, తమ గ్రామంలోనే ఉండేలా చూసుకునేందుకు మరో వర్గం ఎదురుపడి ఇనుప తొడుగులు తొడిగిన వెదురుకర్రలతో విపరీతంగా కొట్టుకుంటారు. ఎంత గాయాలైనా పట్టించుకోరు. అనాదిగా జరుగుతున్న ఈ రక్తపాతానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు.
బందరు శక్తి పటాలు
కృష్ణా జిల్లాలో ఉన్న రేవుపట్టణం బందరులో దసరా సందర్భంలో శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. దాదాపు నూరు సంవత్సరాల క్రితం కలకత్తా నుండి బొందిలీలకు చెందిన సైనికుడు మచిలీపట్నం ఈడేపల్లిలో కాళీమాత ప్రతిష్ట చేసాడు.అప్పటి నుండి దసరా సమయంలో శక్తి ఆలయం నుండి శక్తి పటాన్ని పట్టుకుని పురవీధులలో ఊరేగింపుగా తీకుసుకు రావడం ప్రారంభం అయింది.ఊరేగింపు సమయంలో పట్టాన్ని విపుకు కట్టుకుని ముఖానికి అమ్మవారి భయంకర ముఖాకృతిని తగిలించుకుని నాట్యమాడుతూ వీధులలో తిరుగుతారు. తొమ్మిది రోజులు ప్రభలలో ఇలా ఆన్ని వీధులలోని ఇంటింటికీ తిరుగుతారు. వారి వారి ఇంటికి వచ్చినపుడు వారి మొక్కుబడులు తీర్చుకుంటారు. పటం ధరించిన వారు డప్పు శబ్ధానికి అనుగుణంగా వీరనృత్యం చేస్తూ భయంకరాకృతిలో ఉన్న రాక్షసుని సంహరిస్తున్నట్లు అభినయిస్తారు. చివరిరోజున మచిలీ పట్నం కోనేరు సెంటరుకు తీసుకు వచ్చి జమ్మి కొట్టడంతో ఉత్సవం ముగుస్తుంది.
ఇవే కాకుండా దేశంలో పలు ప్రాంతాలలో రావణ దహనం కార్యక్రమాన్ని పలుచోట్ల నిర్వహిస్తారు. ఢిల్లీ, చండీగఢ్, నాగపూర్ తదితర ప్రముఖ పట్టణాలల్లో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. చెడుపై మంచి విజయంగా నిర్వహించుకునే ఈ పండుగనాడు ప్రతి ఒక్కరు తమతమ దురలవాట్లను పోగుట్టుకుని మంచి వైపు ప్రయాణించాలి. జై దుర్గా మాతా!
– కేశవ