దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఈడీ, సీబీఐలు దూకుడు పెంచాయి. ఇప్పటికే పలువుర్ని అరెస్టు చేసిన అధికారులు ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ అధికారులు ఇప్పుడు మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేశారు. గౌతమ్ మల్హోత్రా మద్యం పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. మంగళవారం రాత్రి గౌతమ్ మల్హోత్రాను కస్టడీలోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మద్యం వ్యాపారులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. గౌతమ్ మల్హోత్రాను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు పాత్ర ఉందన్న ఆరోపణలపై ఆయణ్ను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా బుచ్చిబాబు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా నిన్న బుచ్చిబాబును ప్రశ్నించిన దర్యాప్తు సంస్థ అధికారులు… విచారణ తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.