ఆ పోస్టులే చీకోటి ప్రవీణ్​కు చిక్కులు తెచ్చాయా..?

-

విదేశీ క్యాసినోల వ్యవహారంలో ఏజెంట్లు చీకోటి ప్రవీణ్‌, దాసరి మాధవరెడ్డిలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వర్గాలు వరుసగా రెండో రోజూ విచారించాయి. తొలిరోజు దాదాపు 11 గంటలపాటు ఈడీ కార్యాలయంలోనే గడిపిన వీరిద్దరూ..మంగళవారం ఉదయం తిరిగి విచారణకు హాజరయ్యారు. దాదాపు పది గంటల విచారణ తర్వాత మాధవరెడ్డి వెళ్లిపోగా, ప్రవీణ్‌ విచారణ కొనసాగుతోంది. రెండో రోజు ప్రధానంగా హవాలా లావాదేవీలపైనే ఈడీ అధికారులు వీరిని విచారించారు. క్యాసినోల్లో పంటర్లకు ఇచ్చే టోకెన్లకు సంబంధించిన డబ్బు మార్పిడి ఎలా జరిగేదనే విషయమై ప్రశ్నించి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం.

క్యాసినోల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పంటర్లు రూ.కోట్లలోనే జూదం ఆడినట్లు ఈడీ అనుమానిస్తోంది. వీరిలో కీలక ప్రజాప్రతినిధులతోపాటు సంపన్న వ్యాపారులున్నట్లు ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది. ఆ లావాదేవీల గుట్టుతేల్చే పనిలో భాగంగానే ఈడీ బృందాలు ప్రవీణ్‌, మాధవరెడ్డిల బ్యాంకు ఖాతాలతోపాటు పంటర్లను తరలించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానాల వ్యయాల గురించి ఆరా తీశాయి. ఈ విషయాల గురించి ఈడీ అడిగిన ప్రశ్నలకు పలు సందర్భాల్లో వారిద్దరూ తడబడినట్లు సమాచారం.

మరోవైపు క్యాసినోల ప్రచారం కోసం సినీతారలకు ముట్టజెప్పిన పారితోషికాన్ని ఏరూపంలో ఇచ్చారని ప్రశ్నించగా, ప్రవీణ్‌ పొంతన లేని సమాధానాలిచ్చినట్లు తెలిసింది. ఆడంబరమైన జీవితం గడుపుతూ ఆ దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేస్తూ వచ్చిన ప్రవీణ్‌కు ఇప్పుడా దృశ్యాలే సమస్యలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది. వాటికి ఖర్చు చేసేందుకు వినియోగించిన సొమ్మును ఎలా సంపాదించారని ఈడీ వర్గాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న బ్యాంకు ఖాతాల వివరాలను ప్రవీణ్‌ అధికారులకు చూపించగా, అందులోని తేడాల గురించి వారు ప్రశ్నించినట్టు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version