ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని రెండ్రోజుల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనను కోర్టులో హాజరుపర్చగా, 7 రోజుల కస్టడీ విధించారు. కాగా,ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ చంద్రారెడ్డి, మాగుంట, ఆయన కుమారుడు రాఘవ, సౌత్ గ్రూపులో ఉన్నారని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూపుకు అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు ప్రతినిధులు అని వివరించింది. కవితకు పిళ్లై బినామీగా వ్యవహరించారని, ఆమెకు లబ్ది చేకూర్చేందుకు పిళ్లై అన్నీ తానై వ్యవహరించారని వెల్లడించింది. తాను కవిత బినామీ అని అరుణ్ పిళ్లై విచారణలో చెప్పాడని ఈడీ తెలిపింది.
కవిత బినామీ పిళ్లై అని మరికొందరు కూడా చెప్పారని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చినట్టు పిళ్లై అంగీకరించాడని వెల్లడించింది. రూ.100 కోట్ల పెట్టుబడితో రూ.292 కోట్లు సంపాదించారని వివరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అరుణ్ రామచంద్ర పిళ్లై కీలక పాత్రధారి అని స్పష్టం చేసింది. ఆప్ నేతలు, సౌత్ గ్రూప్ వ్యక్తుల మధ్య పిళ్లై సంధానకర్తగా వ్యవహరించారని, ఇందులోని వ్యక్తులకు 12 శాతం లాభం చేకూర్చడంలోనూ పిళ్లై పాత్ర ఉందని పేర్కొంది. 12 శాతం లాభంగా రూ.420 కోట్లు వస్తే అందరూ పంచుకున్నారని తెలిపింది. సౌత్ గ్రూపు వ్యక్తులకు చెందిన సంస్థలు రూ.3,500 కోట్ల వ్యాపారం చేశాయని ఈడీ వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరో అరెస్ట్ చోటుచేసుకోవడం తెలిసిందే.