యెస్ బ్యాంకు కేసులో రిలయన్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. యెస్ బ్యాంకు నుంచి రూ.12,800 కోట్ల రుణం తీసుకున్న నేపథ్యంలో అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ముంబైలోని ఈడీ కార్యాలయంలో సోమవారం హాజరు కావాలని అనిల్ అంబానీకి ఈడీ ఆదేశాలు జారీ చేసింది.
యెస్ బ్యాంకు తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా ఆర్‌బీఐ ఆ బ్యాంకుపై ఇప్పటికే మారటోరియం విధించగా ఈ నెల 18వ తేదీ నుంచి ఆ నిబంధనను ఎత్తి వేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇక పలు బ్యాంకులు యెస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రానున్నాయి. అయితే యెస్ బ్యాంకు పతనానికి కారణమైన మొండి బకాయిలను రాబట్టేందుకు ఇప్పుడు ఆ బ్యాంకు యత్నిస్తోంది. అందులో భాగంగానే ఈడీ బ్యాంకుకు పెద్ద మొత్తంలో బాకీ ఉన్న రుణ ఎగవేతదారులకు నోటీసులు జారీ చేస్తోంది. దీంతో అనిల్ అంబానీకి ఈడీ సోమవారం నోటీసులు జారీ చేసింది.
అయితే అనారోగ్య కారణాల వల్ల తాను విచారణకు హాజరు కాలేనని అనిల్ అంబానీ అధికారులకు తెలిపారు. ఇక అనిల్ అంబానీతోపాటు యెస్ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణాలు పొందిన వారందరికీ నోటీసులు జారీ చేసినట్లు ఈడీ తెలిపింది. కాగా అనిల్ అంబానీ యెస్ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.12,800 కోట్లు నిరర్థక ఆస్తులుగా మారినట్లు సమాచారం. మార్చి 6వ తేదీన నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ యెస్ బ్యాంకు రుణ ఎగవేత దారుల పేర్లను చదివారు. వారిలో అనిల్ అంబానీ కూడా ఉన్నారు. మరి ఈ విషయంలో ముందు ముందు ఏమవుతుందో చూడాలి..!