బీఈడీ అభ్యర్థులకు శుభవార్త.. ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు ఎడ్ సెట్ కన్వీనర్ వెల్లడించారు. ఎలాంటి ఫైన్ లేకుండా అభ్యర్థులు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. ఎడ్ సెట్ నోటిఫికేషన్ గత నెల 10న విడుదలవగా ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గడువు ముగిసిన నేపథ్యంలో మరోసారి గడువు పెంచారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో edcet.tsche.ac.in దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 ఆలస్య రుసుముతో జూలై 1 వరకు, అలాగే రూ.500 ఆలస్య రుసుముతో జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీలు రూ.450, ఇతరులు రూ.650 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
డిగ్రీ, ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా బీఈడీ చేయొచ్చు. అయితే ఈ ప్రవేశ పరీక్షకు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ ఎడ్‌సెట్ పరీక్ష జూలై 26, 27 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో రెండు సంవత్సరాల బీఈడీ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ తెలంగాణ ఉన్నత విద్యామండలి తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్ నిర్వహిస్తోంది.