2001 సరిగ్గా ఇదే రోజు..తెలంగాణ చరిత్రలో సరికొత్త అధ్యాయం రాస్తూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టిడిపిని వదిలి, పదవులుని వదిలి..ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ బాట పడుతూ..తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించారు..కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అయితే పార్టీ పెట్టినప్పుడు అనేక ఇబ్బందులు ఎదురుకున్నారు. పార్టీ బలం పై అనేక అనుమానాలు ఉన్నాయి. నేతల మద్ధతు తక్కువ. తెలంగాణ ప్రజల సపోర్ట్ కూడా అంతంత మాత్రమే.
ఇక రాజకీయంగా నిలదొక్కుకునేందుకు 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లారు. కాంగ్రెస్ తో అధికారం షేర్ చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ తెలంగాణపై మాట మార్చిందని చెప్పి..పొత్తు నుంచి బయటకొచ్చి ఉపఎన్నికల బరిలో నిలిచారు. ఉపఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అయినా సరే కేసిఆర్ వెనక్కి తగ్గలేదు..తెలంగాణ కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో 2009లో టిడిపితో కలిశారు. కానీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాలేదు. టిఆర్‌ఎస్ కూడా అనుకున్న మేర సత్తా చాటలేదు.
దీంతో ఆ వెంటనే మళ్ళీ టిడిపిని బయటకొచ్చి ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి..ఉపఎన్నికల్లో గెలిచారు. అక్కడ నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఎంపీగా కేసిఆర్ కేంద్రంలో పోరాడుతూనే..ఇటు రాష్ట్రంలో ప్రత్యేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎంతో మంది ఆత్మబలిదానాలు జరిగాయి. చివరికి కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్..తెలంగాణ ఉద్యమానికి తలవంచింది..2014లో ఏపీ నుంచి తెలంగాణని సెపరేట్ చేసింది.
ఆ విధంగా కేసిఆర్ తెలంగాణని సాధించారు..ఇక 2014 ఎన్నికల్లో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు..అదే ఊపుతో 2018 ఎన్నికల్లో కూడా గెలిచి సిఎం పీఠం అధిరోహించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చి..దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడమే లక్ష్యంగా కేసిఆర్ ముందుకెళుతున్నారు. బిఆర్‌ఎస్ గా మారక…పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుంది. ఈ సభ ద్వారా…మరో ఆరు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో సత్తా చాటి..ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా నేతలకు కేసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తున్నారు. మరి ఇవన్నీ కేసిఆర్ సాధ్యం చేసుకుంటారో లేదో చూడాలి.