పదవులు అన్నీ మేలే చేస్తాయి. ఆ విధంగా వైసీపీ కానీ లేదా మిగతా పార్టీలు కానీ అధికారంలోకి రాగానే పదవుల జాబితాలను సిద్ధం చేసేందుకే మొదటి ప్రాధాన్యం ఇస్తాయి. పదవులు అన్నీ కీడే చేశాయి. గతంలో టీడీపీకి తరువాత ఇప్పుడు వైసీపీలో ఉన్న కొందరు నాయకులకు ఇంకా వెనక్కు వెళ్తే రాష్ట్రాన్ని ఏకచక్రాధిపత్యంతో ఏలిక కాంగ్రెస్ నాయకులకూ,ఇంకా అధికార మదంతో ఊగిపోయిన కొందరు నాయకులకు వారి ప్రవర్తన కారణంగా కీడే చేశాయి.
మేలు ఎంత వరకూ కీడు ఎంతవరకూ ? అధికారం ఉంది కదా ! ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా ! అని ఏది పడితే అది మాట్లాడకండి అని జనసేనాని పవన్ కల్యాణ్ హితవు చెబుతున్నారు. ఇదే మాట కార్యకర్తలు కూడా అంటున్నారు. కానీ కొత్త మంత్రులకు ఇవేవీ పట్టడం లేదు. వీళ్లంతా తమ అధినేతను ప్రసన్నం చేసుకునే క్రమంలో లేదా ఆయన దగ్గర మెప్పు పొందే క్రమంలో తమదైన రాజకీయం చేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు అన్న మాటే నిజం ! అన్నది ప్రధాన విపక్షం అయిన జనసేన అభిమతం. కాదంటారా ?
పేదలే కానిమ్ము / ప్రభువులే కానిమ్ము / చివరికవరా దుమ్ము / ఓ కూనలమ్మ అని చెప్పారు ఆరుద్ర. ఆ మాటకు వస్తే ఎవ్వరైనా ఇంటికే పరిమితం కావాలి. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఏ ఆలోచన కూడా చేయకూడదు. ప్రభావశీలక రాజకీయ శక్తులు ఏ మాట చెప్పినా కాస్త ఆలోచించి ఆచి తూచి వెల్లడి చేయాలి. ఇవేవీ కాకుండా ఏం మాట్లాడినా ఆ మాట చెల్లుబాటు కాదు. లేదా ఆ మాట అప్పటికి అంగీకారంలో ఉన్నా తరువాత కాలంలో అధికార మోహంతోనో లేదా దర్పంతోనే చేసిన వ్యాఖ్య కారణంగా చెడు ఫలితాలు అందుకోక తప్పదు. ఇదే ఇవాళ్టి రాజకీయ సూత్రం.
మంత్రులంతా కొత్త వారు కాదు పాత వారు మరియు కొత్తవారు. పునర్వ్యస్థీకరణలో ఈ పాటి సమీకరణలు సామాజిక న్యాయ సూత్రాలు పాటించకపోతే తలనొప్పులు వస్తాయి అని గ్రహించి జగన్ ఎన్నో అంచనాల మధ్య, ఎన్నో తర్జనభర్జనల మధ్య తనదైన నిర్ణయాలు అయితే వెలువరించి, అందరికీ మంచే చేసే ప్రయత్నం చేశారు. అంతవరకూ బాగుంది. ఎప్పటి నుంచో మంత్రి కావాలి అని కలలు కంటున్న అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ దక్కింది. అదేవిధంగా పార్టీకి వీరవిధేయురాలిగా ఉంటూ పోరాడిన
రోజా సెల్వమణికి పర్యాటక శాఖ (వీటితో పాటు క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖలు) దక్కింది. బాగుంది. ఇదే సందర్భంలో మరో ఔత్సాహికుడు, యువకుడు అయిన ఉమ్మడి విశాఖ లీడర్ గుడివాడ అమర్నాథ్ కు పరిశ్రమల శాఖ దక్కింది.
మంత్రి పదవులు ఆశించిన వారిలో చివరి వరకూ ఉత్కంఠతను అనుభవించి తరువాత విజేతగా నిలిచిన వైద్య ఆరోగ్య శాఖ ను దక్కించుకున్న విడదల రజనీ కూడా పెద్దగా పవన్ పై మాట్లాడడం లేదు. రోజా కూడా అదేవిధంగా ఉన్నారు. కానీ అంబటి రాంబాబు మరియు గుడివాడ అమర్నాథ్ మాత్రం ఏవేవో అనాలోచిత రీతిలో మాట్లాడుతున్నారని తమ నాయకుడు పవన్ ను ఉద్దేశించి ఆయన చంద్రబాబు దత్త పుత్రుడు అని అంటున్నారని, ఇదే కాకుండా చాలా మాటలు అర్థరహితంగా మాట్లాడుతున్నారని వాపోతున్నారు. పవన్ కల్యాణ్ కూడా మంత్రుల వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు.
అయినా కూడా పవన్ వ్యక్తిగత జీవితంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి అమర్నాథ్ అత్యత్సాహం చూపిస్తున్నారని, ఇవి కాకుండా
ప్రజా సమస్యలపై మాట్లాడి ఉంటే తామెంతో సంతోషిస్తామని కూడా జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. గతంలో వివిధ పార్టీలు మారి ఆఖరుగా మంత్రి పదవి దక్కించుకున్న గుడివాడ అమర్నాథ్ పొత్తుల విషయమై
వ్యాఖ్యలు చేయడం తగదని హితవు చెబుతున్నారు. ఓ రాజకీయ పార్టీ గా తమని ఎదగనివ్వక చేస్తున్న వైసీపీ ప్రతి ప్రయత్నాన్నీ తాము నిలువరిస్తామని, ప్రజా క్షేత్రంలోనే నాయకుల తీరుపై పోరాటం చేస్తామని అంటున్నారు వీరు.