రాజకీయాల్లో ఏ నాయకుడైన సరే..తమ తమ వారసులని రాజకీయంగా సక్సెస్ చేయాలని చాలా కష్టపడతారు. ముఖ్యంగా వయసు మీద పడిన నేతలు..తమ వారసులని రంగంలోకి దించి..తమ తర్వాత రాజకీయం నడిపేలా చూసుకుంటారు. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లోకి చాలామంది నేతల వారసులు ఎంట్రీ ఇచ్చారు..అందులో కొందరు సక్సెస్ అయ్యారు..కొందరు సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరికొందరు వారసులు ఇప్పుడుప్పుడే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
ముఖ్యంగా అధికార వైసీపీలో చాలామంది నేతల వారసులు యాక్టివ్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నేతల వారసులు ఫీల్డ్‌లో దిగేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల కుమారులు, కుమార్తెలు..తమ తండ్రుల బదులుగా ప్రజల్లోకి తిరుగుతున్నారు. కొందరు నేతలు కూడా వయసు మీద పడుతుండటం, అనారోగ్య కారణాల వల్ల జనంలోకి వెళ్లలేక, తమ వారసులని పంపిస్తున్నారు. ఇప్పటికే పలువురు వారసులు ప్రజల్లో తిరుగుతున్నారు. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో సీటుద దక్కించుకుని పోటీ చేయాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో కొందరు నేతలు..వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయలేమని, తమ వారసులు పోటీ చేస్తారని చెప్పేస్తున్నారు.
అలా తమ వారసులు పోటీ చేస్తారని ప్రకటించిన వారిలో మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన వారసుడు పోటీ చేస్తారని చెప్పేశారు. ఆ మధ్య మచిలీపట్నంలో వైసీపీ ప్లీనరీ సమావేశం జరుగగా, ఆ సమావేశంలో పేర్ని వారసుడు కృష్ణమూర్తి పోటీ చేస్తారని మరో మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించేశారు. అయితే వీరు సొంతంగా ప్రకటించుకోవడం తప్పితే..వైసీపీ అధిష్టానం మాత్రం అధికారికంగా ఏ వారసుడుకు సీటు ఇవ్వలేదు.
తాజాగా అదే విషయాన్ని జగన్ చెప్పుకొచ్చారు. వైసీపీ వర్క్ షాపులో భాగంగా గడపగడపకు వెళ్లని కొందరు ఎమ్మెల్యేల గురించి జగన్ మాట్లాడగా, ఈ క్రమంలోనే తాను నెక్స్ట్ పోటీ చేయనని, తన వారసుడు పోటీ చేస్తారని జగన్‌తో పేర్ని చెప్పినట్లు తెలిసింది. అయితే మీకే కాదు..ఏ వారసుడుకు సీటు ఇవ్వనని, మీరే తనతో కలిసి పనిచేయాలని జగన్ చెప్పేసారట. అలాగే గడపగడపకు ఎమ్మెల్యేలే వెళ్లాలని, వారసులని పంపితే లెక్కలోకి తీసుకోమని చెప్పారట.
పది మంది ఎమ్మెల్యేలు తమ వారసులు బరిలో దిగుతారంటూ తమకు తాముగా ప్రకటనలు ఇచ్చేసుకుంటే.. ఇక అధిష్ఠానం ఎందుకని జగన్ గట్టిగానే ఎమ్మెల్యేలని ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే దాదాపు 27 మంది ఎమ్మెల్యేలు గడపగడపకు పెద్దగా వెళ్లలేదని, ఇంకా 35 మంది ఏదో కొంతవరకు వెళ్లారని..ఓవరాల్ గా చూసుకుంటే 63 మంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల జగన్ అసంతృప్తితోనే ఉన్నారని, నెక్స్ట్ వర్క్ షాపు జరిగే లోపు వారు పనితీరు మెరుగు పర్చుకోవాలని జగన్ సూచించినట్లు తెలిసింది. అలాగే ఇందులో కొందరు మంత్రులు కూడా ఉన్నారని తెలిసింది..వారికి కూడా జగన్ వార్నింగ్ ఇచ్చారట. మొత్తానికి వారసులకు నో సీటు అని జగన్ తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది.