ఐటీ, ఈడీ రైడ్స్..సిట్ విచారణలతో తెలంగాణ రాజకీయాలు ఓ రేంజ్‌లో వేడెక్కాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న రాజకీయ యుద్ధంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటీ, ఈడీలు..టీఆర్ఎస్ నేతల వ్యాపారాలు, క్యాసినో వ్యవహారం..అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన అంశాలపై రైడ్లు కొనసాగుతున్నాయి. అటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన సిట్..బీజేపీ నేతల టార్గెట్ గా నోటీసులు జారీ చేస్తుంది.
ఇప్పటికే లిక్కర్ స్కామ్‌కు సంబంధించి పలువురిని ఈడీ విచారించింది..కొందరి అరెస్టులు కూడా జరిగాయి. ఇక క్యాసినోకు సంబంధించి తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు, పిఏని ఈడీ విచారించింది. అటు ఎమ్మెల్సీ ఎల్ రమణని కూడా విచారించారు. ఇక అనూహ్యంగా మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, తనయుడు మహేందర్ రెడ్డి ఇళ్ళు, ఆఫీసులపై ఐటీ రైడ్స్ మొదలయ్యాయి. మల్లారెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజ్ సీట్లని భారీగా అమ్ముకున్నారని రైడ్స్‌లో తెలినట్లు కథనాలు వచ్చాయి.
అలాగే మల్లారెడ్డి బంధువు ఇంట్లో రెండు కోట్ల ధనం సీజ్ చేశారు. ఇటు మల్లారెడ్డి ఫోన్ కూడా సీజ్ చేశారు. ఐటీ రైడ్స్ నేపథ్యంలో మల్లారెడ్డి తనయుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండోరోజు కూడా మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు, కుమారుడు, బంధువులు, సన్నిహితుల ఇళ్లపై, ఆఫీసులపై ఐటీ దాడులు జరగనున్నాయి.
ఐటీ రైడ్స్‌కు భయపడేది లేదని, ఇదంతా బీజేపీ చేస్తున్న పన్నాగం అని తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. ఐటీ, ఈడీ దాడులకు భయపడకూడదని కేసీఆర్ సైతం..మంత్రులకు సూచించినట్లు తెలిసింది. ఇలా ఐటీ, ఈడీ రైడ్స్ హీట్ నడుస్తుండగానే..మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని మరింత ముందుకు తీసుకెళ్లెలా టీఆర్ఎస్ సర్కార్ ముందుకెళుతుంది. ఇప్పటికే సిట్..పలువురికి నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పటికే బండి సంజయ్ బంధువు, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌ని సిట్ విచారించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, కేరళ వైద్యుడు జగ్గు స్వామి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.
అయితే సంతోష్‌కు నోటీసులు ఇవ్వడంపై బండి సంజయ్..కేసీఆర్ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. సంతోష్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై కన్నీళ్లు పెట్టుకున్నారు. సంఘ్ ప్రచారక్‌లను కేసీఆర్ అవమానానికి గురిచేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ మద్యం స్కామ్ నుంచి బయట పడేందుకే సంతోష్‌ను అవమానిస్తున్నారని బండి సంజయ్ వాపోయారు. బీఎల్ సంతోష్ జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి.