తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి..గత ఏడాది కాలం నుంచి రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఎప్పటికప్పుడు రెండు పార్టీలు తమ అధికార బలాన్ని పూర్తి స్థాయిలో వాడుతూ.. ముందుకెళుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. కేసీఆర్‌ని నిలువరించాలని చూస్తుంది. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్.. బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెడితే.. కేసీఆర్ కేంద్రంపై ఫోకస్ పెట్టారు.
ఇలా ఊహించని విధంగా యుద్ధం నడుస్తోంది..ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో ఈ వార్ మరింత ముదిరింది. రెండు పార్టీలు ఒకరినొకరు చెక్ పెట్టుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా మునుగోడులో గెలవడానికి రెండు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎవరి ఆట వారు రసవత్తరంగా ఆడుతున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ గత కొన్ని రోజులుగా పెద్ద సంచలనమైన వార్తా నడుస్తోంది. ఈ స్కామ్‌లో కవిత కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలని అడ్డంపెట్టుకుని బీజేపీ.. కేసీఆర్‌ని టార్గెట్ చేస్తుంది. అలాగే మునుగోడులో గెలుపే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపి.. టీఆర్ఎస్ నేతలని బీజేపీలోకి లాగేస్తున్నారు. ఇక దీనికి కౌంటరుగా కేసీఆర్ సైతం సరికొత్త ఎత్తులతో ముందుకొచ్చారు..బీజేపీలో ఉన్న బడా నేతలని టీఆర్ఎస్‌లోకి లాగేశారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం హాట్ టాపిక్ అయింది.
బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు..టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావులని కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారు..ఆ కొనుగోలుకు సంబంధించిన ఆడియో టేప్‌లు కూడా బయటకొచ్చిన విషయం తెలిసిందే. కొనుగోలుకు ప్రయత్నించిన వారిని సైతం అరెస్ట్ చేశారు. అయితే ఇది పూర్తిగా కేసీఆర్ గేమ్ లాగా ఉంది. బీజేపీకి కౌంటర్ ఇవ్వడానికే ఈ తరహా రాజకీయం నడిపించారని అర్ధమవుతుంది.
ఇక ఇప్పటివరకు బయటకురాని, ఆ నలుగురు ఎమ్మెల్యేలు తాజాగా మునుగోడులో కేసీఆర్ సభకు వచ్చారు..అక్కడ వారిపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. అలాగే బీజేపీ, మోదీలపై విరుచుకుపడ్డారు. ఇటు కేసీఆర్‌కు కౌంటరుగా బీజేపీ కూడా ఫైర్ అయింది. అసలు ఎమ్మెల్యేల కొనుగోలు మొదలుపెట్టిందే కేసీఆర్ అని, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలని ఏ స్థాయిలో కొన్నారో తెలుసని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు మాట్లాడారు. ఇప్పుడు నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి లాక్కున్నవారే అని ఫైర్ అయ్యారు.
మొత్తానికి ఓ వైపు మునుగోడు, మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు అంశాలపై టీఆర్ఎస్-బీజేపీల మధ్య పెద్ద వార్ నడుస్తోంది. ఇక్కడ ఎవరు గేమ్ వారు ఆడుతున్నారు. ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని కేసీఆర్ అంటున్నారు..మరి టీఆర్ఎస్‌లోకి ఎంతమంది కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు ఎలా వచ్చారో చెప్పడం లేదు. ఇటు బీజేపీ సైతం ఎంతమందిని కేసీఆర్ చేర్చుకున్నారో చెబుతున్నారు గాని, ఆ ఎమ్మెల్యేల కొనుగోలుతో తమకు పూర్తి స్థాయిలో సంబంధం లేదనే విషయాన్ని నిరూపించడానికి కష్టపడుతున్నారు. మొత్తానికి ఎవరి ఆట వారు ఆడుతున్నారు.