ఇన్నాళ్లకు ఉద్యోగుల విషయమై ఓ కఠిన నిబంధన తెరపైకి రానుంది.జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఫలిస్తే ఉద్యోగుల్లో క్రమశిక్షణాయుత వాతావరణాన్ని పెంపొందనుందనే భావించాలి.ఆఫీసులకు వేళకు సరిగా రావాలి అంటే కోపోద్రుక్తులయ్యే ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది జగన్ సర్కార్. ఆ వివరం వివాదం ఈ కథనంలో… ఆలస్యంగా రావడం,తొందరగా వెళ్లిపోవడం అన్నవి ఇకపై చెల్లవు.
ఉద్యోగి వేళకు రావాలి, రాకపోతే ఆ రోజు సెలవు కింద పరిగణించి డ్యూటీ చేయించాలి అన్న నిబంధన ఒకటి కఠిన రీతిలో త్వరలో అమలు కానుంది. నిరసనల వేళ ప్రభుత్వాలు మాట వినని ఉద్యోగులను ఎలా దార్లోకి తెచ్చుకోవాలో తమకు తెలుసు అని ఆ రోజు మంత్రులు కొందరు అన్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రాలో నిజం అవుతున్నాయి. తాజా జీఓ కారణంగా సమయానికి విధులకు హాజరు కాని ఆలస్యాల రాజులకు, కారణాల కలహాల రాణులకు ఇకపై మూడిందనే చెప్పాలి. వారి ఆటలు చెల్లవు. జగన్ సర్కార్ చెల్లనివ్వదు. జీతం తగ్గిందంటే హై కోర్టుకు వెళ్లగలరు కానీ వేళకు ఉద్యోగానికి రమ్మకంటే ఏ కోర్టుకు వెళ్లి ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తాం అని చెప్పగలరు?
ఈ నేపథ్యంలో సమయ పాలన పాటించని ఉద్యోగులపై జగన్ సర్కార్ క్రమశిక్షణ సంబంధ చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా ఇచ్చింది. సచివాలయం కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక శాఖ ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని,వేళకు వచ్చి నిర్ణీత వేళల్లో విధులు ముగించుకుని వెళ్లాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. నిర్దేశించారు.
దీంతో ఉద్యోగ వర్గాల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాము ఆఫీసుకు వేళకు రావడం అన్నది ఎప్పుడూ చేస్తూనే ఉన్నామని, పని ఒత్తిడి కారణంగా ఎక్కువ సమయం పనిచేసిన దాఖలాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ ఉత్తర్వుల్లో 10 గంటల 10 నిమిషాలకు ముందే ఉద్యోగులు అంతా తమ విధుల్లో ఉండాలని, సాయంత్రం ఐదున్నర వరకూ తప్పక విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఆ సమయం దాటితే సెలవుగా పరిగణించి జీతంలో కోత విధిస్తామని అంటున్నారు. ఒకవేళ పెర్మిషన్ పేరిట విధులకు ఆలస్యం కావాలనుకున్నా సరే పది గంటల పది నిమిషాల నుంచి 11 గంటల వరకూ నెలకు 3 సార్లు మాత్రమే అనుమతి ఉంటుంది అని సంబంధిత ఉత్తర్వు స్పష్టం చేస్తోంది. అదేవిధంగా ఉద్యోగులపై నిరంతర నిఘా కూడా ఉంటుందని జగన్ సర్కార్ వెల్లడిస్తోంది.
జగన్ సర్కార్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు కారణంగా పలువురు ఉద్యోగులు తమ అభిప్రాయాలను భిన్న రీతిలో వెల్లడి చేస్తున్నారు. మొన్నటి చలో విజయవాడ తదనంతరం చేసిన కొన్ని నిరసనల కారణంగా జగన్ మోహన్ రెడ్డి తమపై కక్ష్య సాధింపునకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఆ రోజు ప్రభుత్వం చెప్పినా ఉద్యోగుల జీతాల బిల్లుల ప్రక్రియను కొందరు ఉద్యోగులు చేపట్టలేదు.
ఎందుకంటే తాము కూడా నిరసనల్లో భాగమేనని చెబుతూ మొండికేశారు. దీంతో వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని తీరాలని భావించినా ఎందుకనో వెనక్కు తగ్గారు.అప్పటికే చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయి ఉండడంతో తామేం చెప్పినా కూడా వినేందుకు ఉద్యోగులు ఇష్టంగా లేకపోవడంతో జగన్ కూడా చాలా వెనక్కు తగ్గారు. కానీ ఇన్నాళ్లకు జగన్ తన బాణాన్ని వదిలారు. దీనిపై నిరసలనకు దిగినా ఉద్యోగులే ప్రజల్లో చులకన అయిపోతారు కనుక జగన్ సర్కార్ ఈ జీఓను అన్ని శాఖలకూ వర్తింపజేయాలని ఆలోచిస్తోంది.