ఎడిట్ నోట్: పవన్ ‘కింగ్ మేకర్’ ‘ప్లాన్’..!

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వరం మారింది..రాజకీయం మారింది..ఇంతకాలం పొత్తుల గురించే ప్రస్తావిస్తూ..జగన్‌ని గద్దె దించడానికి పొత్తులు తప్పనిసరి అని మాట్లాడిన పవన్..ఇప్పుడు సింగిల్ గా ముందుకెళుతున్నారా? అనే విధంగా రాజకీయం మొదలుపెట్టారు. ప్రజలు తనకు అవకాశం ఇస్తే సి‌ఎం అవుతానని చెబుతున్నారు..జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, జనసేనతో అభివృద్ధి ఏంటో చూపిస్తామని అంటున్నారు.

అసలు టి‌డి‌పి మాట లేకుండా పవన్ మాట్లాడుతున్నారు. మొత్తం సింగిల్ ప్లాన్ తోనే ఉన్నారు. జనసేనని ఆదరించాలని కోరుతున్నారు. ఓ వైపు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే..ప్రజలకు జనసేన తరుపున హామీలు ఇస్తూ..జనసేనని గెలిపించాలని కోరుతున్నారు. అదే సమయంలో ఎవరికి రాని విధంగా పవన్‌కు ఆలోచన వస్తుంది. అసలు ఊహించని ఓట్లని సైతం దక్కించుకోవాలని చూస్తున్నారు. మామూలుగా సినీ ఇండస్ట్రీలో పవన్ తో పాటు చాలామంది హీరోలు ఉన్నారు. వారికి పవన్ మాదిరిగానే భారీ ఫ్యాన్ బేస్ ఉంది.

అయితే ఆ హీరో ఫ్యాన్స్ అందరినీ రాజకీయ పరంగా తనకు మద్ధతు ఇవ్వాలని కోరుతున్నారు. సినిమాని వేరుగా, రాజకీయాన్ని వేరుగా చూడాలని అంటున్నారు. సినిమాల విషయంలో ఎవరి హీరో ఫ్యాన్స్..వారి హీరోకి మద్ధతు ఇచ్చుకుంటారు..కానీ రాజకీయంగా అంతా తనకు మద్ధతు ఇవ్వాలని కోరుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, చిరంజీవి ఫ్యాన్స్ అంటూ తాజా సభల్లో పవన్ ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. అందరి ఫ్యాన్స్ తనకు మద్ధతు ఇవ్వాలని కోరుతున్నారు.

అలాగే ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్ధులు ఎవరు నచ్చక నోటాకు ఓటు వేసేవారు ఉన్నారు. దాదాపు 2-3 శాతం నోటాకు ఓట్లు పడుతున్నాయి. అయితే అలా నోటాకు వేసి వేస్ట్ చేసి బదులు..తమ జనసేనకు ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఇలా సింగిల్ గా జనసేన బలపడేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో పొత్తులకు వెళ్తారా? లేదా ఒంటరిగా వెళ్ళి..ఎవరికి మెజారిటీ రాకపోతే కింగ్ మేకర్ అవ్వాలని కోరుకుంటున్నారా? అనేది తెలియడం లేదు.

ఒకవేళ పార్టీ బలపడితే పొత్తుల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయవచ్చు..ఏకంగా సి‌ఎం సీటు అడగవచ్చు. పొత్తు లేకపోతే..ట్రైయాంగిల్ ఫైట్ జరిగితే ఎవరికి మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోతే జనసేనకు 30-40 సీట్లు వస్తే కింగ్ మేకర్ అవ్వాలని పవన్ భావిస్తున్నట్లు ఉన్నారు. మరి ఈ రెండిటిల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version