అంతా కావాలి.. అందరూ తోడు నిలవాలి..దళితులు, మైనార్టీలు లేకుండా సమాజం ఎక్కడిది. కానీ కొన్ని సార్లు పార్టీలు చేసే తప్పిదాలు వేల సందేహాలకు ఆనవాళ్లు అవుతాయి. కొన్ని సార్లు వారు చేసే తప్పిదాలు విపక్షాల విమర్శలకు అంతూపొంతూ అన్నవి లేకుండా చేస్తాయి. రాహుల్ గాంధీ కూడా చాలా పెద్ద తప్పే చేసి వెళ్లాడు. పరువు హత్యలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన నాగరాజు ఉదంతంలో సంబంధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడంతో రాజకీయ చర్చ ఒకటి బలీయంగా నడుస్తోంది.
తమ లీడర్ల కోసం పాటుపడడం బాగుంది కానీ అదేవిధంగా తమ ప్రగతి మరియు అభ్యున్నతి కోసం మాట్లాడడం బాగుంది కానీ ఇదే సమయాన దళితుల కోసం మాట్లాడకపోవడం అత్యంత విషాదం అని కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు అభిప్రాయపడుతున్నారు.
వరంగల్ లో రైతు సంఘర్షణ సభ అనూహ్య విజయం సాధించింది. ఎన్నడూ లేని విధంగా రాహుల్ తప్పులు లేకుండా తడబాటు లేకుండా మాట్లాడారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇదే విషయమై సోషల్ మీడియాలో కూడా రాహుల్ పై ప్రశంసల వాన కురుస్తోంది. రైతుకు రుణమాఫీ పేరిట రెండు లక్షల రూపాయల రుణాన్ని రద్దు చేస్తామని చెప్పి, మరోమారు చర్చకు తావిచ్చారు.
రైతులతో పాటు కౌలు రైతులనూ ఆదుకుంటామని చెప్పడంతో మరోమారు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే తాము రైతు బంధు, రైతు బీమా వంటివి వర్తింపజేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి చెబుతోంది. కనుక కొత్తగా కాంగ్రెస్ వచ్చి చేసేదేం లేదని కూడా చెబుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా రైతులను ఆకర్షించే పనులు లేదా మాటలు కొన్ని చేసి వెళ్లారు రాహుల్.
ఇదే సమయంలో ఆయన కొన్ని తప్పిదాలు కూడా చేసి వెళ్లారు అని అంటున్నారు సోషల్ మీడియా యాక్టివిస్టులు. ఎలానో చూద్దాం…
హైద్రాబాద్, సరూర్ నగర్లో జరిగిన పరువు హత్య కారణంగా అనేక వివాదాలు రేగుతున్నాయి. వాదనలు వినిపిస్తున్నాయి. నాగరాజు అనే దళిత యువకుడ్ని అత్యంత పాశవికంగా అమ్మాయి తరఫు బంధువులు చంపడం వీటిపై వివిధ పార్టీలు స్పందించడం అన్నది ఇప్పుడొక చర్చకు తావిస్తోంది. నాగరాజు, అశ్రిన్ జంట చేసుకున్న పెళ్లిని అంగీకరించలేకే అమ్మాయి తరఫున బంధువులు ఈవిధంగా అత్యంత అమానవీయ ధోరణిలో ప్రవర్తించారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.
ఇక ఇదే విషయమై మరో వాదన వినిపిస్తోంది.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా రైతుల గురించి మాట్లాడిన రాహుల్..దళితుల విషయంలో స్పందించనే లేదని పలువురు వాపోతున్నారు. రాష్ట్ర రాజధానినే కదిపి కుదిపేసిన ఈ అంశంపై మాట్లాడకపోవడం శోచనీయం అని అంటున్నారు. అరెస్ట్ అయిన లీడర్ల కోసం చంచల్గూడ జైల్ లోపలికి వెళ్ళిన రాహుల్ గాంధీ.. నాగరాజు కుటుంబాన్ని పరామర్శించలేకపోయాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఒదిలేసినట్టే అనుకోవచ్చా..
అని ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్ స్పందిస్తున్నారు. అంటే రాహుల్ తప్పిదం చేశారా లేదా తెలంగాణ కాంగ్రెస్ నాయకులే దగ్గరుండి ఈ తప్పునకు కారణం అయ్యారా?