అతి చేస్తే గతి చెడుతుంది అని అంటారు. ఓ పాలకుడు అయినా ఓ పాలక వర్గ ప్రతినిధి అయినా ఆలోచించాల్సింది ఆటలో గెలవడం ఎలా అని.. కానీ ఆటకు సంబంధించి ఆలోచనలు మానుకుని, ఇతర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం అనాలోచితం. ఆ విధంగా ఇప్పటికీ ఎన్నో సార్లు ఎన్నో వివాదాలు రేగాయి. ప్రజా సమస్యలు పట్టని పాలకుల కారణంగా ఓ ప్రభుత్వం తిరోగమనం చెందుతుంది. ప్రజా సమస్యలు పట్టని పాలకుల కారణంగా ఓ ప్రభుత్వం ఇంటి ముఖం పడుతుంది. ఇవేవీ పట్టని లేదా పట్టించుకోని వారు మళ్లీ గెలుపు గుర్రాలు అవుతారా ? అంటే సమస్యల కన్నా మిగతా విషయాలే మిక్కిలి ప్రాధాన్యమా ?
ఏపీలో విభిన్న వాతావరణం ఉంది. అతి పొగడ్త ఉంది. అతి దూషణ ఉంది. అతిక్రమణ ఉంది. అతి అన్నది అన్నింటా ఉంది. కనుక ఇక్కడ ప్రజా సమస్యలు పరిష్కారంలో లేవు. ముఖ్యంగా సున్నావడ్డీ పథక నిర్వహణ బాగున్నా సంబంధిత సభలు సీఎం కు క్షీరాభిషేకాలు చేసేందుకు పరిమితం అవుతున్నాయి. పొదుపు సంఘాలకు జగన్ ఇచ్చిన కానుక సున్నా వడ్డీ పథకం. ఈ పథకంతో మహిళలకు ఎంతో ఆసరా దక్కడం ఖాయం. వీటిని కదా వివరించాలి. ఓ పొదుపు సంఘం నాన్ పెర్ఫార్మింగ్ లోకి వెళ్లకుండా ఏం చేయాలి.. ఏ విధంగా పనిచేయాలి.. ఆర్థిక స్వావలంబన సాధనే ధ్యేయంగా ఎలా ఉండాలి.. ఇవి కదా వివరించాలి.
కానీ ఇవేవీ కాకుండా జగన్ సర్కారుకు చెందిన ఎమ్మెల్యేలు అదే పనిగా ఆయన్ను పొగిడేందుకు, తమ ఉనికి కాపాడుకునేందుకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు వైఎస్ ఉన్నప్పుడు కానీ ఇవాళ జగన్ ఉన్నప్పుడు కానీ క్షీరాభిషేకాలు అన్నవి వివాదాలకు తావిస్తున్నాయి. వీటి కారణంగా ఎటువంటి ప్రయోజనం ఉండదు.
ఇక పాదాభివందనాలు గురించి వద్దాం.. నిన్నటి వేళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, అమలాపురంలో నిర్వహించిన కుడిపూడి చిట్టబ్బాయి (మాజీ ఎమ్మెల్యే) ప్రథమ వర్థంతి సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సభాముఖ్యంగా పాదాభివందనం చేసి స్తుతించారు మంత్రి చెల్లుబోయిన వేణు. ఆ కుటుంబాన్ని జగన్, సుబ్బారెడ్డి ఎంతగానో ఆదుకున్నారని చెప్పారు. ఎందుకీ పాదాభివందనాలు. మొన్నటి వేళ మంత్రుల ప్రమాణం వేళ కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. అంటే ఇది విధేయతకు సంకేతమా ? అన్న విమర్శ ఒకటి వినిపిస్తోంది.