ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చేసింది చెప్పే దమ్ము, చేయాల్సిన వాటిపై సారించాల్సిన దృష్టి అన్నవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇప్పటిదాకా చేసిన మంచి పనులు, సంక్షేమానికి సంబంధించి బీసీలకూ, ఎస్టీలకూ, ఎస్సీలకూ మైనార్టీలకూ ఏ విధంగా ఆదుకుని, వారి ఉన్నతికి కృషి చేసింది గడపగడపకూ మన ప్రభుత్వంలో వివరిస్తున్నారు.ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే మంత్రుల పర్యటన ఒకటి డిజైన్ చేశారు జగన్. ప్రస్తుతం ఆయన దావోస్ పర్యటనలో ఉన్నా, ఇక్కడి యాత్రకు సంబంధించి అక్కడి నుంచే దిశా నిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి ఆశయ సాధనకు అనుగుణంగా సంక్షేమమే పరమాధి అని భావించి బడుగు వర్గాలకు చేస్తున్న మేలు వివరించేందుకు బస్సు యాత్ర చేపట్టనున్నారు మంత్రులు. 17 మంది మంత్రులతో బయలుదేరే ఈ యాత్ర ప్రధానంగా బీసీలకు ప్రభుత్వం ఏం చేసింది.. ఏయే పథకాలు అందిస్తోంది అన్నవి వివరిస్తూ.. ముఖ్యమయిన చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తూ సాగనుంది. ఇవాళ శ్రీకాకుళంలో శ్రీకారం దిద్దుకున్నాక, రేపు రాజమండ్రిలో మరో బహిరంగ సభకు మంత్రులు సిద్ధం కానున్నారు.
మంత్రి ధర్మాన, బొత్స, మేరుగ నాగార్జున, బూడి ముత్యాల నాయుడుతో సహా ఇతర మంత్రులంతా ఇప్పటికే చేరుకున్నారు. పటిష్టమైన పోలీసు భద్రత నడుమ ఈ యాత్ర నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు సామాజిక న్యాయ భేరి పేరుతో పర్యటించేందుకు, బస్సు యాత్ర చేపట్టేందుకు మంత్రులంతా సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీసీ, మైనార్టీ మంత్రులంతా శ్రీకాకుళం చేరుకున్నారు. ఇవాళ (మే 26,2022) ఉదయం అరసవల్లి సూర్యనారాయణ మూర్తి దేవస్థానంలో ప్రత్యేక పూజల అనంతరం, శ్రీకాకుళం నగరంలో ఉన్న ఏడు రోడ్ల కూడలి కి బస్సు యాత్ర చేరుకోనుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడనున్నారు. పాలన సంబంధ ప్రగతిని వివరించనున్నారు.