టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఇందుకు గానూ ఎడిట్ ఆప్షన్‌నిచ్చింది. బుధవారం నుంచి ఈ నెల 5 వరకు దరఖాస్తుదారులు వెబ్‌సైట్‌ను సంప్రదించి తప్పులను సవరించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన వెల్లడించారు. 5,089 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 6న నోటిఫికేషన్ జారీచేయగా, దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 28తో ముగిసింది. మొత్తంగా 1.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థులు https ://schooledu.telangana.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించి తప్పులుంటే సవరించుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (సీబీఆర్‌టీ) పద్ధతిలో జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, భాషా పండితులకు నిర్వహించే పరీక్షల్లో 160 ప్రశ్నలుంటాయి. ఒక్కో దానికి అర మార్కు చొప్పున 80 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. వీరికి టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అంటే మొత్తం 100 మార్కులకు పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకు కేటాయిస్తారు. ఇక పీఈటీ, పీఈడీలకు టెట్ అవసరం లేదు. అందువల్ల వారికి 100 మార్కులకు టీఆర్‌టీ నిర్వహిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షల తేదీలను మార్పు చేసిన విషయం తెల్సిందే. వాయిదాపడ్డ ఈ డీఎస్సీ పరీక్షలు.. జనవరి 2024 చివరి వారం లేదా ఫిబ్రవరి 2024 మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ టీఆర్‌టీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.