చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈషా సింగ్, మను బాకర్, రిథిమ్ సంగ్వాన్ లతో కూడిన భారత మహిళల జట్టు షూటింగ్ లో పసిడి ప్రదర్శన కనబరిచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ లో భారత మహిళల జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది.
ఆసియా గేమ్స్ మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో తెలంగాణకు చెందిన ఈషా సింగ్ లో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. అలాగే వ్యక్తిగత 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ లో సైతం ఈషా వెండి పతకం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈషా సింగ్ బృందం 1,759 పాయింట్లతో భారత్‌కు గోల్డ్ మెడల్ సాధించి, టీమ్ స్పిరిట్‌ను చాటిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అమలుచేస్తున్న పటిష్ట కార్యాచరణే జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికల్లో తెలంగాణ క్రీడాకారులు కనబరుస్తున్న ప్రతిభకు నిదర్శనమని సీఎం అన్నారు. తెలంగాణ క్రీడాకారులు రానున్న రోజుల్లో మరెన్నో పతకాలు సాధించి, తెలంగాణ ఖ్యాతిని జగద్వితం చేయాలని సీఎం ఆకాంక్షించారు.