భాగ్యనగరాన్ని మళ్లీ వరణుడు పలకరించాడు. ముఖ్యంగా జంట నగరాల్లో వరణుడు ఈదురుగాలులతో కూడిన వర్షంతో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం ఆకాశం మేఘావృతమై పలుచోట్ల సాయంత్రం నుండి కుండపోత వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో నగరం తడిసి ముద్దైంది. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉండటంతో వాతావరణశాఖ హైదరాబాద్ లో ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. దీంతో నిమజ్జనాలకు ఆటంకం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలను జీహెచ్ఎంసీ అలెర్ట్ చేసింది.
పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. హిమయత్ నగర్, ఖైరతాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్, కోఠి, చార్మినార్, బేగంబజార్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్టీకాపూల్, ట్యాంక్ బండ్, చంద్రాయణగుట్ట, బహదూర్ పుర, హబ్సిగూడ, మల్లాపూర్, నాచారం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో అమీర్పేట నుంచి పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్షీకపూల్, రవీంద్ర భారతి వరకు వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు పంజాగుట్ట నుంచి జీవీకే , బంజారాహిల్స్, మసాబ్ ట్యాంక్, మెహదీపట్నం రూట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.