భారత్, ఇంగ్లండ్ ల మధ్య చెన్నైలో రెండో టెస్టు మ్యాచ్ శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ విజృంభించడంతో భారత్ ప్రస్తుతం 6 వికెట్లు కోల్పోయి 290 పరుగుల స్కోరు చేసింది. అయితే మొదటి టెస్టు మ్యాచ్ కూడా చెన్నైలోనే జరిగినప్పటికీ దానికి ఉపయోగించిన పిచ్ వేరే. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పిచ్ వేరు. ఈ క్రమంలోనే ప్రస్తుత పిచ్‌పై మాజీ ఇంగ్లండ్ ప్లేయర్ మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం ఆడుతున్న చెన్నై పిచ్ అత్యంత దుర్బేధ్యంగా మారుతుందని వాన్ అన్నాడు. ఈ పిచ్‌పై సమయం గడిచే కొద్దీ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని అన్నాడు. 3, 4వ రోజుకు పిచ్ బాగా మారుతుందని, స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలిపాడు. కనుక బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ముందుగా 300 స్కోరు చేసినా అది ఈ పిచ్‌పై 500 స్కోరుతో సమానం అన్నాడు.
కాగా మొదటి టెస్టు మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్ పరమ చెత్తగా ఉందని సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పిచ్ ను రూపొందించడంపై స్టేడియం సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు ఇంగ్లండ్ స్పిన్నర్‌లు కూడా తొలి రోజు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. దీంతో భారత స్పిన్నర్లు ఈ పిచ్‌పై ఎలా రాణిస్తారు.. అన్నది ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఉదయం ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభిస్తే ఆ జట్టు బ్యాట్స్‌మెన్ భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారన్నది వేచి చూస్తే తెలుస్తుంది.