హుజూరాబాద్‌లో విజయం తర్వాత ఈటల రాజేందర్ దూకుడు పెంచారు. అధికార పార్టీపై పదునైన విమర్శలు సంధిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్క్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ నిర్ణయాలను కాదని ఈటల రాజేందర్ సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించినా ఈటల తన అనుచరులను రంగంలో దించడం చర్చకు దారి తీసింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల జరుగుతున్నాయి. ఇప్పటికే 12 స్థానాలకుగాను ఆరు ఏకగ్రీవం కావడంతో టీఆర్‌ఎస్ ఖాతాలో పడ్డాయి. మిగతా చోట్ల కూడా ఆ పార్టీనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ తనకు బలం ఉన్న చోట బరిలోకి దిగింది. కానీ, కాషాయ పార్టీ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నది. ఆ మేరకు అధికారికంగా ఎవరినీ బరిలోకి దించలేదు.
తన అవమానకరమైన రీతిలో గెంటేసిన టీఆర్‌ఎస్ పార్టీకి మరో ఝలక్ ఇవ్వాలని ఈటల రాజేందర్ తహతహలాడుతున్నారు. అందుకే, కరీంనగర్ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానానికి మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్‌తో నామినేషన్ వేయించారని చర్చ సాగుతోంది. ఆదిలాబాద్‌లో తన అనుచరుడు రవీందర్‌రెడ్డిని రంగంలోకి దించాడు. కానీ, ఆయన నామినేషన్ ఉపసహరించుకున్నారు. రవీందర్ సింగ్ మాత్రం బరిలో నిలిచారు. ఆయన్ని గెలిపించడం కోసం ఈటల రాజేందర్ తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
బీజేపీలో ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే నాయకులు ధిక్కరించే అవకాశం దాదాపు ఉండదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ వద్దన్నా ఈటల తన అనుచరులను రంగంలోకి దింపడంపై కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నట్లు చర్చ ప్రారంభమైంది. హుజూరాబాద్‌లో విజయం కూడా ఒక్కరకంగా కమలం పార్టీ ఖాతాలో పడలేదనే చెప్పాలి. ఈటల తన సొంత చరిష్మాతోనే గెలిచినట్లు ప్రచారం జరుగుతున్నది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ బరిలో ఉండటం, బీజేపీ దూరంగా ఉండటంపై ఈటల రాజేందర్ అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాజకీయ పార్టీ అన్న తర్వాత గెలిచినా ఓడినా ఎన్నికల్లో పోటీ చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి రావాలనే చూస్తున్న పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటం సబబు కాదని, ఎన్నిక ఏదైనా పోటీ చేసి తీరాలని ఈటల పేర్కొన్నట్లు తెలుస్తున్నది.