దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకుల అధ్యాయన కార్యక్రమం రెండవ రోజు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. చట్టసభల్లో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ప్రజల కోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఇటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు, ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు సంఘర్షించాల్సి ఉంటుందన్నారు.
ఈ సంఘర్షణ ప్రారంభదశలో మనతో కలిసివచ్చే శక్తులకు కొంత అనుమానాలు, అపోహ ఉంటుందన్నారు. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు సీఎం కేసీఆర్. కొత్త రాష్ట్రం తెలంగాణ రైతులందరికీ ఉచిత విద్యుత్ సాగునీటిని అందిస్తుందని.. ఇదేపనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయదూ? అంటూ ప్రశ్నించారు. రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్లు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్ లు ఉన్నాయా? అని అన్నారు.
దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎందుకున్నది? రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయి?.. కేంద్ర పాలకుల నిర్లక్ష్యం వల్లే అని చర్చించాల్సిన సందర్భం ఇదన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా కేంద్ర ప్రభుత్వ పాలన గాడిలో పడలేదని అన్నారు . ప్రజల ఆకాంక్షలు నెరవేరక పోవడానికి కారణాలను అన్వేషించాలన్నారు. దేశంలోని రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడంలేదో ఆలోచించాలని.. ఈ దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో మనందరం చర్చిం చాల్సిన సందర్భం ఆరంభమైందన్నారు.