చంద్రబాబునాయుడు ఎస్సీల గురించి తాజాగా చేసిన వ్యాఖ్యాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. పార్టీలోని నేతలతో జూమ్ కాన్ఫరెన్సు ద్వారా ’దళిత శంఖారావం’ కార్యక్రమం నిర్వహించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీలపై వరసుగా దాడులు, అకృత్యాలు, అన్యాయాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి నోరెత్తటం లేదంటూ ధ్వజమెత్తాడు. జగన్ కు ఓట్లేయటమే ఎస్సీల పాపమా ? ఎస్సీలను జగన్ కట్టుబానిసల్లాగ చూస్తున్నాడంటూ ఫైర్ అయిపోయాడు. సరే జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటమంటే చంద్రబాబు రోజుల తరబడి మాట్లాడుతాడు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే దళితులకు చంద్రబాబు హయాం ఏమైనా స్వర్ణయుగమా అనే డౌటనుమానం పెరిగిపోతోంది.
దళితులపై ఇపుడు ఏమైతే జరుగుతున్నాయని చంద్రబాబు+చినబాబు+టిడిపి నేతలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారో తమ హయాంలో ఇంతకన్నా ఎక్కువే జరిగిన విషయాన్ని కన్వీనియంట్ గా మరచిపోయినట్లు నటిస్తున్నారు. టిడిపి హయాంలో కూడా ఎస్సీ, ఎస్టీలపై చాలా దాడులే జరిగాయి. అయితే అప్పట్లో బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు ఎక్కడా దాఖలాలు లేవు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఎస్టీ మహిళను టిడిపి నేతలు రోడ్డు మీద బట్టలూడదీసి చచ్చేట్టు కొట్టారు. దీనిపై ఎస్టీలు ఎన్ని ఆందోళనలు జరిగినా చర్యలే లేవు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో అయినా సొంతూరు చంద్రగిరిలో అయినా ఎస్టీ, ఎస్సీ మహిళలను గుడ్డలూడదీసి కొట్టినా టిడిపి నేతలపై కేసులు లేవు. పైగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులపై పాకాలలో టిడిపి నేతలు దాడి చేశారు.
సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ’అవకాశం ఉంటే దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని స్వయంగా చంద్రబాబు చేసిన కామెంట్లు అప్పట్లో సంచలనమైంది. నిజానికి ఇదే వ్యాఖ్య ఇంకెవరైనా చేసుంటే టిడిపి నేతలు, దళిత సంఘాలు ఎంత గోల చేసేవో. ఫిరాయింపు మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ఎస్సీలు శుభ్రంగా ఉండరని, చదవుకోవటం తెలీదని, చివరకు స్నానం కూడా చేయరంటూ బహిరంగంగా వ్యాఖ్యానించాడు. మరి ఈ వ్యాఖ్యలను టిడిపి నేతలు ఏ విధంగా చూస్తారు ? అలాగే జగన్ ప్రభుత్వంపై ఇపుడు రెచ్చిపోతున్న ఆర్టీసీ మాజీ ఛైర్మన్, సీనియర్ నేత వర్ల రామయ్య బస్సు తనిఖీ సందర్భంగా సొంత సామాజికవర్గంపైనే అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు. దళితులపై దాడులు చేయటం, నోటికొచ్చినట్లు తిట్టటంలో మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ గురించి ఎంత తక్కువ చెప్పినా ఎక్కువే.
సరే ప్రతిపక్షమన్న తర్వాత అధికారపార్టీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ చేసే ఆరోపణలు, విమర్శలు సహేతుకంగా ఉంటేనే జనాలు కూడా మెచ్చుకుంటారు. అధికారంలో ఉన్నపుడు తప్పులు చేసిన చంద్రబాబు ఇపుడు వాటికి రివర్సులో మాట్లాడుతుంటే దళితులు, ఎస్టీలు ఎందుకు పట్టించుకుంటారు ? అసలు టిడిపి తరపున గడచిన రెండు ఎన్నికల్లో తమ తరపున ఒక్క ఎస్టీ కూడా ఎందుకు గెలవటం లేదో పార్టీ ఏనాడైనా విశ్లేషించుకుందా ? 24 గంటలూ జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేసినంత మాత్రానా చంద్రబాబుకు ఎటువంటి ఉపయోగం ఉండదు.
-Vuyyuru Subhash