వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) వద్ద భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదంలో చైనా చొరబాటుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ తప్పుబట్టారు. పరిస్థితి అదుపులో ఉందని, పిఎల్‌ఎ భారత భూభాగంలోకి ప్రవేశించలేదని అన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
చైనా సైన్యంతో భేటీలో ఎల్‌ఐసి స్టాండ్ ఆఫ్ పై ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా చెప్పామని ఆయన అన్నారు. “పరిస్థితి మన నియంత్రణలో ఉంది …. భారత భూభాగంలోకి చైనా ప్రవేశిస్తుందనే వాదనలు పూర్తిగా నిరాధారమైనవి” అని రాజనాథ్ సింగ్ అన్నారు. చైనాతో కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నాయని రాజనాథ్ సింగ్ అన్నారు. ఇది పరిష్కారం అవుతుందో మాకు తెలియదని ఆయన వివరించారు. అన్ని వివరాలను పూర్తిగా బయట పెట్టలేమని ఆయన చెప్పారు.