ఇటీవల హైదరాబాదులో ఐదేళ్ల చిన్నారి వీధికుక్కల దాడిలో మృతి చెందడం తెలిసిందే. కాగా, కుక్కల దాడిలో మృతిచెందిన బాలుడి కుటుంబానికి జీహెచ్‌ఎంసీ నుంచి మేయర్ విజయలక్ష్మి పరిహారం ప్రకటించింది. ఆ బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేయనున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రకటించింది. హైదరాబాదులో ఇవాళ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అఖిపలక్ష కార్పొరేటర్ల సమావేశం జరిగింది.
బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ తరఫున రూ.8 లక్షలు ప్రకటించగా, కార్పొరేటర్లు తమ ఒక నెల వేతనంతో మరో రూ.2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా, కుక్కల నివారణకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బాలుడు మృతిచెందిన ఘటనను హైకోర్టు ఇప్పటికే సుమోటో పిటిషన్‌గా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.