యూఏఈలో హత్యలకు పాల్పడ్డారంటూ ఇద్దరూ భారతీయులకు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ విషయాన్ని మన విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఈ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసింది. మరణశిక్షకు గురైన వారిని మహమ్మద్ రినాష్ అరింగిలొట్టు, మురళీధరన్ పెరుమ్తట్టు వలప్పిల్ గా గుర్తించారు. వీరిద్దరూ కూడా కేరళ వాసులే కావడం గమనార్హం.
ఓ యూఏఈ వాసి హత్య కేసులో మహమ్మద్ రినాష్ దోషఇగా తేలాడు. ఓ భారతీయుడిని హత్య చేసిన కేసులో మురళీధనర్ కి శిక్ష పడింది. వీరిద్దరికీ అవసరమైన దౌత్య, న్యాయ సాయం అందజేసినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. యూఏఈ జైలులో భారతీయ మహిళా షెహజాది ఖాన్ కు ఉరిశిక్షకు అమలు చేసిన విషయం రెండు రోజుల క్రితమే వెల్లడి అయింది. ఓ హత్య కేసులో ఆమెకు ఈ శిక్ష విధించారు. దాదాపు ఏడాది పాటు ఆమె న్యాయపోరాటం చేసినా ఫలితం లభించలేదు. ఫిబ్రవరి 15వ తేదీనే ఆమెను ఉరితీసినా.. ఆ సమాచారం ఆలస్యంగా వారి కుటుంబ సభ్యులకు చేరింది.