తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. అత్యల్పంగా కేవలం 6 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదు అయింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. జిల్లాలోని అర్లి అనే గ్రామంలో కేవలం 6 డిగ్రీల ఉష్ణోగ్రతనే నమోదు అయింది. అలాగే అదిలాబాద్ జిల్లా కేంద్రంలో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదు అయింది. మరి కొద్ది రోజుల సైతం ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ముఖ్యంగా ఆదివారం, సోమ వారం కూడా ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లానే కాకుండా రాష్ట్రాన్ని కూడా చలి వణికిస్తుంది. సంగరెడ్డి జిల్లాలో 8 డిగ్రీలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరి లింగంపల్లిలో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాగల రెండు నుంచి మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాధారణం కంటే.. దాదాపు 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపారు.