ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ఎడిషన్‌ను స్టేడియాల్లో చూడాలనుకుంటున్నవారికి ఐపీఎల్ యాజమాన్యం చేదువార్త చెప్పింది. ఈసారికి స్టేడియాల్లోకి ప్రేక్షకులను పూర్తిగా అనుమతించడం లేదని తెలిపింది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
నిజానికి ఐపీఎల్ 2021ను కొద్ది రోజుల వరకు స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని, తరువాత పరిస్థితిని బట్టి ప్రేక్షకులను అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ పెద్దలు తెలిపారు. అయితే బ్రిజేష్ పటేల్ మాత్రం తాజాగా వెల్లడించిన విషయం ఐపీఎల్ ప్రేక్షకులకు షాక్‌నిచ్చింది. ఈ టోర్నీ మొత్తానికి అసలు స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లను నిర్వహిస్తామని, ఈసారికి ఇంతేనని ఆయన తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఈ చేదు వార్తను దిగమింగలేకపోతున్నారు.
కాగా ఐపీఎల్ ఈసారి ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభం కానుండగా, మే 30వ తేదీన ముగియనుంది. 6 వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఆరంభ మ్యాచ్ ముంబైకి, బెంగళూరుకు మధ్య జరగనుంది. తటస్థ వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇక కొత్తగా అందుబాటులోకి వచ్చిన నరేంద్ర మోదీ స్టేడియం కూడా పలు మ్యాచ్‌లకు వేదిక కానుంది.