కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ప్రకటనపై అన్ని రాజకీయ పార్టీల నుంచి హర్షం వ్యక్తం చేశాయి. అయితే తాజాగా సాగు చట్టాలపై రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సాగు చట్టాల గురించి రైతులకు వివరించి..వారిని ఒప్పించేందుకు కేంద్రం విఫలమైందని ఆయన అన్నారు. రైతులు ఆందోళన నేపథ్యంలో చట్టాలను రద్దు చేయడం మంచిదే అని అన్నారు. అలాగే, ’’అవసరమైతే సాగు చట్టాలను తిరిగి తీసుకురావొచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సరైన అడుగు వేసిందనే నా ఆలోచన.” అని పేర్కొన్నారు.
అంతకుముందు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ బిల్లులు వచ్చాయి.. రద్దు చేయబడ్డాయి. కానీ ఆ చట్టాలు తిరిగి రావచ్చు… వాటిని మళ్లీ రూపొందించవచ్చు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ జిందాబాద్, ఖలిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు ఇచ్చే వారి తప్పుడు ప్రణాళికలకు ప్రధాని తెర దించారని పేర్కొన్నారు బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్. వ్యవసాయ చట్టాల రద్దుకు యూపీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.