Farm Training : సండే వచ్చిందంటే పొలాల బాట పడుతున్న పిల్లలు

-

ఫిదా సినిమాలో వరుణ్ తమ్ముడిని పాలు ఎక్కడి నుంచి వస్తాయ్ రా మీకు అని సాయిపల్లవి అడిగితే ప్యాకెట్ నుంచి అని చెబుతాడు. గేదెల నుంచి పాలు వస్తాయని కూడా ఆ పిల్లాడికి తెలియదు. నేటి తరంలో చాలా మంది పిల్లలకు తాము తినే తిండి, కూరగాయలు, సరకులు ఎలా వస్తాయో తెలియదు. అయితే ఈ జనరేషన్ తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు పిల్లలకు కేవలం చదువే కాకుండా.. వారి సృజనాత్మక వెలికితీసేలా వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు సండే వస్తే సినిమా, రెస్టారెంట్లు, గేమింగ్ జోన్లకు వెళ్లే పిల్లలను ఇప్పుడు ఫార్మింగ్ స్కూళ్లకు తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు. పిల్లలకు వ్యవసాయంపై అవగాహన కల్పించేలా.. ప్రకృతితో పిల్లల్ని మమేకం చేసేలా చేస్తున్నారు.

టైం దొరికిందంటే చాలు ఫోన్లకు అతుక్కుపోయే పిల్లలను మొదట్లో ఈ ఫార్మింగ్ స్కూళ్లకు తీసుకెళ్లడం తల్లిదండ్రులకు కష్టమైంది. కానీ ఒక్కసారి ఫార్మింగ్ కు వెళ్లిన పిల్లలు అక్కడ ప్రకృతితో మమేకమై ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకున్నారు. కేవలం ఎంజాయ్ చేయడమే కాకుండా.. వ్యవసాయం గురించి తెలుసుకున్నారు. పంటలు ఎలా పండిస్తారు.. ఒక పంట రావడానికి రైతులు ఎంత కష్టపడతారన్న విషయాన్ని తెలుసుకుంటున్నారు.

 

పిల్లలకు వ్యవసాయంలో మెలకువలను నేర్పిస్తూ సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి హైదరాబాద్ శివార్లలో వెలుస్తున్న నేచురల్‌ ఫార్మింగ్‌ స్కూళ్లు. పదుల ఎకరాల్లో ఏర్పాటు చేయడం, నగరానికి 60కిలోమీటర్ల పరిధిలోనే ఇవి ఉండటంతో సెలవురోజుల్లో పిల్లలతో తల్లిదండ్రులు ఇటు వైపు వస్తున్నారు. పదుల ఎకరాల్లో పదుల సంఖ్యలో పంటలను పండిస్తుండటంతో తక్కువ సమయంలో ఒకే వేదికగా అన్ని పంటల గురించి తెలుసుకునే వెసులుబాటు కలుగుతోంది. పప్పులు, ధాన్యాలు, కూరగాయలు, పండ్ల పెంపకంలో చిన్నారులను భాగస్వామ్యం చేస్తుండటం విశేషం.

నారు పోయడం.. కలుపు తీయడం, కుప్పనూర్చడం, సేంద్రియ ఎరువులు తయారు చేయడం.. పశువులకు మేత వేయడం చేయిస్తుండటంతో విద్యార్థులు కొత్త అనుభూతిని పొందుతున్నారు. దీంతోపాటు వ్యవసాయక్షేత్రం మొత్తం తిరిగేలా ‘ఫార్మ్‌ట్రైన్‌’ వంటివి ఏర్పాటు చేస్తుండటం విశేషం. రోజూ 5 గంటల నుంచి 12గంటలు స్లాట్‌ల వారీగా అరగంట చొప్పున ఒక్కో కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు.

“ప్రతినెలా 300 మంది మా వ్యవసాయక్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. నగరానికి చెందిన వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు సందర్శించారు. ఐదు రకాల పప్పుదినుసులు, నూనెగింజల్లో నువ్వులు, వేరుశెనగ, సన్‌ఫ్లవర్‌ వంటివి పండిస్తున్నాం. వరి, గోధుమ, మొక్కజొన్న, తృణధాన్యాల్లో జొన్నలు, రాగులు, కొర్రలు, క్యాబేజీ, మిర్చి, వంకాయలు, క్యారట్‌, బీట్‌రూట్‌, వంటి పదుల సంఖ్యలో కూరగాయలు పండిస్తున్నాం. ఆవు, గేదె, గాడిద, గొర్రె, మేక, కుందేలు, కోడి, గుర్రం, టర్కీకోడి, బాతులకు ఆహారం అందించడంతోపాటు జంతువుల నుంచి పాలు పితకడంపై స్వీయ అనుభవం కల్పిస్తున్నాం. ప్రతీ కార్యక్రమం 25 నిముషాల చొప్పున అందిస్తూ 10 రకాల కార్యక్రమాలు ఐదుగంటల్లో నేర్పిస్తాం. వీటన్నింటినీ 20 నిముషాల్లో చూడటానికి ట్రాక్టర్‌కు అనుసంధానించి రూపొందించిన ఫార్మ్‌ ట్రైన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.” ఫార్మింగ్ స్కూల్ ప్రతినిధులు

Read more RELATED
Recommended to you

Exit mobile version