తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశానని అన్నారు సీఎం కేసీఆర్. ఆత్మవిశ్వాసం, గెలవాలనే చిత్తశుద్ధి ఉంటే తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనన్నారు. శనివారం సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర రైతు నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర షెట్కారి సంఘటన్ రైతు నేత శరత్ జోషి ప్రణీత్ తో సహా పలువురు రాష్ట్ర నేతలకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చెక్కుచెదరని విశ్వాసంతో ధర్నా చేశారని, కేంద్రం వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేసిందని ఆరోపించారు. అందుకు ప్రధాని మోదీ క్షమాపణలు కూడా చెప్పారని అన్నారు. సీఎంగా ఉండి కూడా రైతుల కోసం పోరాటం చేశానని అన్నారు. రైతుల కొట్లాట వల్లే కేంద్రం మూడు సాగు చట్టాలను రద్దు చేసిందని.. రైతుల పోరాటం న్యాయమైందని అన్నారు. తెలంగాణలో ఏం చేశామో మీరంతా ఒక్కసారి చూడాలని, కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని వారిని కోరారు.