- రైతుల పోరాటానికి మద్దతుగా హైదరాబాద్‌లో ర్యాలీ
హైదరాబాద్: ప‌్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీతో రైతులు హోరెత్తిస్తున్నారు. ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రైతన్నలకు మద్దతుగా రైతులు, మద్దతుదారులు పోరు నడుపుతున్నారు. ఢిల్లీ సరిహద్దులో గత రెండు నెలల నుంచి ఆందోళనలు చేస్తున్న అన్నదాతలకు సంఘీభావం తెలుపుతూ అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ నేతృత్వంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం సరూర్‌నగర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ.. మంగళవారం సాయంత్రం ఉప్పల్ క్రాస్ రోడ్డు వద్ద ముగియనుంది. ఈ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఈ ర్యాలీపై నిఘా ఉంచారు. ఈ ర్యాలీలో వామపక్ష పార్టీలతో పాటు ప్రతిపక్షపార్టీలు కూడా పాలుపంచుకున్నాయి. వామపక్ష నేతలైన చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రంలతో పాటు ఇతర పార్టీ కార్యవర్గ సభ్యులు, అలాగే ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొన్నారు.