ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఇటీవల తిరుపతిలో ఒకే రోజు మూడు ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం జరిగి మరణించిన ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. సంక్రాంతి సెలవులకు వెళ్లేటప్పుడు కొన్ని.. తిరిగి వచ్చేటప్పుడు ఇలా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.
తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తెలంగాణ వాసులు ప్రాణాలను కోల్పోయారు. తిరుపతిలోని రేణిగుంట సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో హైదరాబాద్ కి చెందిన దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. హైదరాబాద్ కు చెందిన సందీప్, అంజలీ దేవి దంపతులు తిరుపతి నుంచి వస్తుండగా.. రేణిగుంట సమీపంలోని కుక్కలదొడ్డి వద్ద వీరి కారును ఓ ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో వారు ఇరువురు అక్కడికక్కడే మరణించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.