40 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్ సెమీ ఫైనల్స్ చేరుకున్నది. క్వార్టర్ ఫైనల్స్ గ్రేట్ బ్రిటన్‌ను 3-1 తేడాతో మట్టి కరిపించింది. కానీ, సెమీ ఫైనల్స్‌లో బలమైన బెల్జియం జట్టు చేతిలో ఓటమిపాలైంది. కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడనున్నది. అయితే, భారత హాకీ జట్టు సెమీఫైనల్స్ చేరుకోవడంలో మాజీ కెప్టెన్, గోల్ కీపర్ పి.ఆర్.శ్రీజేష్ పాత్ర ఎంతో ఉన్నది. గోల్ పోస్టుకు అడ్డు గోడలా నిలిచి భారత విజయాల్లో కీలకపాత్ర పోషించిన శ్రీజేష్ కెరీర్ తొలినాళ్లలో ‘కిట్’ కొనుగోలుకూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తన తండ్రి పాడి ఆవును విక్రయించి కిట్‌ను కొనుగోలు చేసి ఇచ్చాడు.
నా కొడుకు అథ్లెట్ కావడం పట్ల ఎంతో ఆసక్తి కనబర్చేవాడు. కానీ, మేము గ్రామంలో నివసిస్తుండటంతో హాకీ గ్రౌండ్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కావు. తిరువనంపురంలోని జి.వి.రాజ స్పోర్ట్స్ స్కూల్‌లో శ్రీజేష్ ఎనిమిదో తరగతిలో ప్రవేశం పొందిన తర్వాత అతడి జీవితంలోకి హాకీ వచ్చింది అని అనాటి రోజులను రవీంద్రన్ గుర్తు చేసుకున్నాడు.
కానీ, ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను ఓ సామాన్య రైతుని. నాకు పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. ఆ రోజుల్లో గోల్ కీపర్ కిట్ ధర రూ.10,000 ఉండేది. అది మా స్తోమతకు మించింది. అయినా సరే నా కొడుకు కలలను నెరవేర్చాలని అనుకున్నాను. పాడి ఆవును విక్రయించి డబ్బులు సమకూర్చాను. శ్రీజేష్ కఠోర శ్రమనే అతడిని ఇక్కడి వరకు తీసుకువచ్చింది అని రవీంద్రన్ పేర్కొన్నాడు.